يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَقۡرَبُواْ ٱلصَّلَوٰةَ وَأَنتُمۡ سُكَٰرَىٰ حَتَّىٰ تَعۡلَمُواْ مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِي سَبِيلٍ حَتَّىٰ تَغۡتَسِلُواْۚ وَإِن كُنتُم مَّرۡضَىٰٓ أَوۡ عَلَىٰ سَفَرٍ أَوۡ جَآءَ أَحَدٞ مِّنكُم مِّنَ ٱلۡغَآئِطِ أَوۡ لَٰمَسۡتُمُ ٱلنِّسَآءَ فَلَمۡ تَجِدُواْ مَآءٗ فَتَيَمَّمُواْ صَعِيدٗا طَيِّبٗا فَٱمۡسَحُواْ بِوُجُوهِكُمۡ وَأَيۡدِيكُمۡۗ إِنَّ ٱللَّهَ كَانَ عَفُوًّا غَفُورًا
ఓ విశ్వాసులారా! మీరు మత్తులో ఉంటే, మీరు పలికేది గ్రహించనంత వరకు మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబున్) అయి ఉంటే - స్నానం చేయనంత వరకు - నమాజ్ సమీపానికి వెళ్లకండి; కాని నడుస్తూ (మస్జిద్) నుండి దాట వలసి వస్తే తప్ప. కాని ఒకవేళ మీరు రోగపీడితులై ఉంటే, లేదా ప్రయాణంలో ఉంటే, లేక మలమూత్రవిసర్జన చేసి ఉంటే, లేక స్త్రీలతో సంభోగం చేసి ఉంటే - మీకు నీళ్ళు దొరక్కపోతే - పరిశుద్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి, ఆ చేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను, తుడుచుకోండి (తయమ్మమ్ చేయండి). నిశ్చయంగా అల్లాహ్ తప్పులను మన్నించేవాడు, క్షమించేవాడు.
- ఇది మద్యపానానికి సంబంధించిన రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ 2:219లో వచ్చింది. ఈ ఆజ్ఞ వచ్చినప్పుడు, ఇంకా మద్యపానాన్ని హరాం చేసిన ఆయతు (5:90) అవతరించబడలేదు.
- అంటే మస్జిద్ నుండి దాటిపోతే ఎలాంటి పాపం లేదు. (ఇబ్నె-కసీ'ర్). ప్రయాణీకులను గురించిన ఆజ్ఞ ముందు వస్తోంది.
- తయమ్మమ్ విధానం: ఒకసారి మీ అరచేతులతో పరిశుద్ధ భూమి (మట్టి)ని తాకండి. వాటితో ముఖాన్ని తుడుచుకోండి, తరువాత మీ రెండు చేతుల వెనుక భాగాలను మణికట్ల వరకు తుడుచుకోండి. (ముస్నద్ అ'హ్మద్ పుస్తకం - 4, పేజీ - 263. ఇంకా చూడండి, 5:6).