Skip to content

మరణాంతర జీవనాన్ని రుజువు చేయటం ఎలా సాధ్యం?

محاور التعريف بالإسلام
اليوم الآخر والمصيرالبعث بعد الموت
مصدر الإجابة
قسم البعث | كتاب: الإسلام دين رب العالمين، ص 16-17.
الباب / الفصل
(قسم البعث)

السؤال

మరణాంతర జీవనాన్ని రుజువు చేయటం ఎలా సాధ్యం?

الجواب

మరణాంతరం లేపబడటమును తిరస్కరించేవాడిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, ఎందుకంటే ఇది వివేకం తప్పనిసరి చేసే విషయం, మరియు దైవ సందేశాలన్నీ దీనిని విశ్వసిస్తాయి, మరియు సాధారణంగా ఏదో ఒక రూపంలో లేదా ఏదో ఒక విధంగా మరణాంతరం లేపబడటమును విశ్వసించని మతమేదీ లేదు, మరియు దీనికి సమాధానం ఈ క్రింది విధంగా ఉంది:

మొదటిది: సృష్టిరాసులను తిరిగి బ్రతికించడం అనేది న్యాయం మరియు వివేకం యొక్క ఆవశ్యకత; ఒకవేళ మరణాంతరం లేపటం ఉండదని మనం భావించినట్లయితే, అప్పుడు ఈ గ్రహంపై మానవుని ఉనికి వృధాగా మారుతుంది, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

﴾ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా?﴿

[అల్ ముమినూన్:12-14]

ఒక వేళ మరణాంతరజన్మ లేదని మనం భావిస్తే, మరి దుర్మార్గుడి నుండి అన్యాయానికి గురైనవాడికి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోబడుతుంది? మరియు భూమిలో కల్లోలం సృష్టించేవారు న్యాయం యొక్క చేతులకు చిక్కి శిక్షించబడక ముందే ఒక వేళ వారు సహజ మరణం పొందితే, వారికి ఎలా ప్రతిఫలం లభిస్తుంది? మరియు బలహీనుల కొరకు గొప్ప కార్యాలు చేసి, ఈ ఇహలోక జీవితంలో తమ కార్యాలకు ఎలాంటి ప్రతిఫలం పొందని సంస్కర్తలకు ఏ విధంగా ప్రతిఫలం ఇవ్వబడుతుంది? అందువల్ల సర్వలోకాల ప్రభువు ముందు ప్రజలు నిలబడే రోజు ఒకటి ఖచ్చితంగా ఉండి తీరాలి, తద్వారా ఆయన ప్రతీ ఒక్కరికీ వారి కర్మల పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:-

﴾ఏమీ? మేము విధేయులను (ముస్లింలను) నేరస్థులతో సమానంగా ఎంచుదుమా?﴿

[అల్ ఖలమ్: 35]

దీనిని మనం ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం: ఒక వేళ ఒక దుర్మార్గపు మానవుడు వెయ్యి మందిని చంపి, మహిళలపై అత్యాచారం చేసి, సంపదలను దొంగిలించి, ఆ తరువాత సహజ మరణం పొందితే, మరియు న్యాయం అతని దరికి చేరక అతని నుండి ప్రతీకారం తీసుకోబడకపోతే, అతడు తన శిక్షను ఎలా పొందుతాడు? మరియు జరిగిన ఈ అన్యాయాలకు, చిందించబడిన రక్తానికి, భంగపరచబడిన మానప్రాణాలకు, మరియు దోచుకోబడిన సంపదలకు బదులు ఎలా తీర్చబడుతుంది? వాటి హక్కుదారుల తరపున ప్రతీకారం ఎలా తీర్చబడుతుంది? ఒక వేళ పునరుత్థానం లేకపోయి ఉంటే, భూమిపై కల్లోలం సృష్టించిన క్రూరమైన నేరస్థుడు శిక్ష నుండి తప్పించుకోవడం అనేది అత్యంత దారుణమైన విషయంగా ఉండేది. కానీ నిశ్చయంగా అల్లాహ్ ప్రతి బాధితుడికి, అతనికి అన్యాయం చేసిన వాడి నుండి ప్రతీకారం తీరుస్తాడని మనకు తెలియజేశాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

﴾నిశ్చయంగా, ఎవరు మా సూచనలను తిరస్కరించారో! వారిని మేము మున్ముందు నరకాగ్నిలో పడవేస్తాము. ప్రతిసారీ వారి చర్మాలు కాలిపోయి నపుడల్లా వాటికి బదులుగా - వారు బాధను బాగా రుచి చూడటానికి - వేరే చర్మాలతో మార్చుతాము. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు మహావివేచనాపరుడు.﴿ [సూరతున్నిసా: 56]

అవిశ్వాసి నరకాగ్నిలో దహించబడతాడు. అతని చర్మం కాలిపోయిన ప్రతిసారి, శిక్షను అనుభవించేందుకు అతనికి మరో చర్మం మార్చబడుతుంది. అలాగే అతడు చేసిన ప్రతి అన్యాయానికి ప్రతీకారం తీసుకోబడుతుంది. అతడు వెయ్యిమందిని హత్య చేసి ఉంటే, పునరుత్థాన దినాన మహోన్నతుడైన అల్లాహ్ అతనిని వెయ్యిసార్లు చంపుతాడు. ఇలాంటి విషయం ఈ లోకంలో జరుగుతుందా? నిజానికి ఒక నేరస్థుడు వందమందిని హత్య చేసినా, అతడు పట్టుబడితే గరిష్టంగా ఒక్కసారి మాత్రమే చంపబడతాడు; అప్పుడు అతడు మరణిస్తాడు.

రెండవది: ఈ క్రింది ఆధారాల ద్వారా మరణాంతరం లేపబడటాన్ని నిరూపించవచ్చు:

నిశ్చయంగా భూమ్యాకాశాలను సృష్టించే సామర్ధ్యం గల అల్లాహ్, మానవులను మరోసారి సృష్టించే సామర్ధ్యం గలడు. కాబట్టి, ఈ మహా ఖగోళాలను సృష్టించినవాడు మానవులను మరోసారి సృష్టించటం నుండి అశక్తుడు కాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

﴾వాస్తవానికి, ఆకాశాలను మరియు భూమిని స్పష్టించటం, మానవులను సృష్టించటం కంటే ఎంతో గొప్ప విషయం, కానీ చాలా మంది ప్రజలకు ఇది తెలియదు.﴿

[గాఫిర్ 39]

నిశ్చయంగా మొట్టమొదటి మనిషి ఆదమును మట్టి నుండి సృష్టించి మరియు అతనిని ఒక సంపూర్ణ మనిషిగా చేసిన అల్లాహ్ కు, మనిషి మట్టిగా మారిన తరువాత తిరిగి జీవనం పోయడంలో కూడా శక్తి ఉంటుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరలిపోయాడు. అతడు ఇలా అంటాడు: "కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు?" చెప్పు: "అవి మొదటిసారి సృష్టించినవాడు వాటిని తిరిగి బ్రతికించగలడు. మరియు ఆయన ప్రతి సృష్టిని గురించి బాగా తెలిసినవాడు.﴿

[యా,సీన్: 78-79]

నిస్సందేహంగా అల్లాహ్, ఎవరైతే ప్రతీ రోజు ఒక అల్పమైన వీర్యబిందువు నుంచి ధ్రవపదార్ధపు సారంతో జరిగే మనిషి యొక్క నూతన సృష్టిని మనకు చూపుతున్నాడో, ఆయనకు సృష్టిని మరోసారి పునః సృష్టించడం అసాధ్యం కాదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

﴾ఓ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు; అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది.﴿

[హజ్జ్: 5]

నిశ్చయంగా అల్లాహ్ ఈ జీవితంలో మనం తరచుగా చూసే ఒక ఉదాహరణను మన ముందు ఉంచాడు, అదేమిటంటే భూమి బంజరుగా, నిర్జీవంగా, ఎటువంటి జీవం లేకుండా ఉంటుంది. అప్పుడు దానిపై వర్షం కురుస్తుంది, దానితో అది పులకించి సజీవంగా మారుతుంది మరియు అందాలు చిందించే ప్రతి జత పచ్చని మొక్కలను పుట్టిస్తుంది. నిస్సందేహంగా దానిని జీవింపజేసినవాడే మృతులను కూడా జీవింపజేస్తాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు ఆయన సూచన (ఆయాత్) లలో ఒకటి: నిశ్చయంగా నీవు భూమిని పాడు నేలగా (ఎండిపోయిన బంజరు నేలగా) చూస్తున్నావు; కాని మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపించగానే, అది పులకించి, ఉబ్బి పోతుంది. నిశ్చయంగా దీనిని (ఈ భూమిని) బ్రతికించి లేపే ఆయన (అల్లాహ్ యే) మృతులను కూడా బ్రతికించి లేపుతాడు. నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు.﴿

[ఫుస్సిలత్ : 2-4]

నిశ్చయంగా అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో మన కొరకు మరణాంతరం లేపబడటం పై సూచించే ఒక అద్భుతమైన సూచనను ఏర్పాటు చేశాడు, అదేమిటంటే మనం అటవీ మంటలలో చూస్తున్నట్లుగానే పచ్చటి తడి చెట్ల నుండి వేడి అగ్ని వెలువడటం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మీరు రాజేసే అగ్నిని గమనించారా?

దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా?

మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము.﴿

[అల్ వాఖిఅ: 77 - 80]

అయితే ఎవరైతే దానికి విభిన్నమైన దాని నుండి అంటే పచ్చటి చెట్టు నుండి వేడి అగ్నిని వెలికి తీస్తాడో, అతడే మృతుల నుండి సజీవులను వెలికి తీయటంపై సామర్ధ్యం కలవాడు.

నిద్ర అనేది మరణానికి మరియు మరణాంతరం లేపబడటానికి ఒక సూక్ష్మరూపం; మానవుడు తన అత్యుత్తమ స్థితిలో మరియు శక్తితో ఉండటాన్ని మనం చూడటం లేదా, ఆ తరువాత అతన్ని నిద్ర ఆవహించినప్పుడు, నిద్ర సమయములో అతని ఆత్మ అతని శరీరమును వదిలివెళుతుంది, కాబట్టి తన చుట్టూ ఉన్నవాటిని అతడు అనుభూతి చెందడు, మరియు బహుశా అతడు నివసించే ఇంటికి నిప్పంటుకున్నా అతనికి తెలియదు కనుక అతడు కాలిపోతాడు. కాబట్టి మానవుడు మరణించినట్లయితే, అతడు తన నిద్ర నుండి మేల్కొన్నట్లుగానే మరణాంతరం లేపబడతాడు, మరియు ఇది మనలో ప్రతి ఒక్కరూ తమలో మరియు తమ చుట్టూ ఉన్నవారిలో చూసే ఒక ప్రత్యక్ష సాక్ష్యం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు ఆయన సూచనలలో, మీరు రాత్రిపూట మరియు పగటి పూట, నిద్ర పోవటం మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో శ్రద్ధతో వినేవారికి ఎన్నో సూచనలున్నాయి.﴿

[అర్రూమ్ : 27]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾అల్లాహ్ యే ఆత్మలను (ప్రాణాలను) మరణ కాలమున వశపరచుకునేవాడు మరియు మరణించని వాడి (ఆత్మలను) నిద్రావస్థలో (వశపరచుకునే వాడునూ). తరువాత దేనికైతే మరణం నిర్ణయింప బడుతుందో దానిని ఆపుకొని, మిగతా వారి (ఆత్మలను) ఒక నియమిత కాలం వరకు తిరిగి పంపుతాడు. నిశ్చయంగా ఇందులో ఆలోచించే వారికి గొప్ప సూచనలు (ఆయాత్) ఉన్నాయి.﴿

[జుమర్: 42]

అది దైవప్రవక్తలైన మహనీయ ఇబ్రాహీం ఖలీల్, మూసా లేదా ఈసా అలైహిమస్సలాంల ద్వారా జరిగినప్పటికీ, మానవులు లేదా జంతువులలో మరణించిన వారిని తిరిగి బ్రతికించడం మరియు వారు తిరిగి సజీవులు అవ్వడం వంటి తన ప్రవక్తల (అలైహిమస్సలాం) ద్వారా జరిగిన అద్భుతాలను అల్లాహ్ మనకు ప్రస్తావించాడు. కాలక్రమంలో జరిగిన సంఘటనల నుండి గుణపాఠం నేర్చుకోవాలనుకునే వారి కోసం చరిత్ర భద్రపరిచిన భౌతిక మరియు జ్ఞానాత్మక ఆధారం ఇది.

పునరుత్థానాన్ని (బఅస్) విశ్వసించడం అగోచర విషయాలను విశ్వసించడంలో భాగం. దీని గురించి మరియు ఇతర అగోచర విషయాలను గురించి అల్లాహ్ మనకు తెలియజేశాడు, వీటిపై విశ్వాసం ఉంచడం మీదనే మానవుని ధార్మిక మరియు ప్రాపంచిక ప్రయోజనాలు ఆధారపడి ఉన్నాయి. ఈ అగోచర విషయాలు అక్షరాలా సత్యమైనవనే సంపూర్ణ విశ్వాసాన్ని ఒక ముస్లింకు ప్రసాదించే అనేక నిదర్శనాలను ఆయన మనకోసం ఏర్పాటు చేశాడు. తద్వారా అతను వాటిని తన కళ్ళతో చూస్తున్నట్లుగానే తన హృదయంతో గ్రహిస్తాడు. అగోచర విషయాల సమాచారం ఇమిడి ఉన్న దివ్యవాణి (వహీ), బుద్ధి ధృవీకరించే అనేక వాస్తవాలను మరియు కచ్చితమైన విషయాలను అందించినట్లుగానే, మానవుడు తన జీవితంలో వాటి సత్యతను గ్రహిస్తాడు. కాబట్టి, తనకు తెలిసిన విషయాల సత్యత, తనకు గోప్యంగా ఉన్న (అగోచర) విషయాల జ్ఞానాన్ని అతనికి మరింత దృఢపరుస్తుంది.

మరణాంతరం లేపబడటం పై విశ్వాసం లేకుండా ఎవరి ఇస్లాం మరియు విశ్వాసము సరైనవి కావు. మరియు మరణాంతరం లేపబడటంను తిరస్కరించేవాడు, అతను ఎంతటి మేలు మరియు పుణ్యకార్యాలు చేసినప్పటికీ గొప్పవాడైన అల్లాహ్ పై అవిశ్వాసం చూపినవాడే అవుతాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾సత్యాన్ని తిరస్కరించిన వారు (చనిపోయిన తరువాత) మరల సజీవులుగా లేపబడమని భావిస్తున్నారు. వారితో ఇలా అను: "అది కాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడతారు. తరువాత మీరు (ప్రపంచంలో) చేసిందంతా మీకు తెలుపబడుతుంది. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.﴿

[అత్తగాబున్: 9-10]

المصدر

قسم البعث كتاب: الإسلام دين رب العالمين، ص 16-17. قسم البعث كتاب: الإسلام دين رب العالمين، ص 16-17.

ملاحظات

--