Skip to content

ఇస్లాం విశ్వాసం ప్రకారం, నా ముస్లిమేతర కుటుంబం పరలోకంలో స్వర్గంలోకి ప్రవేశించదు, ఇది నిజమేనా?

مصدر الإجابة
قسم الإسلام
الباب / الفصل
(قسم الإسلام)

السؤال

ఇస్లాం విశ్వాసం ప్రకారం, నా ముస్లిమేతర కుటుంబం పరలోకంలో స్వర్గంలోకి ప్రవేశించదు, ఇది నిజమేనా?

الجواب

సర్వస్తోత్రాలన్నీ అల్లాహ్ కొరకే. పరలోకంలో మానవుని అంతిమ గమ్యానికి సంబంధించిన విషయం అల్లాహ్ కే చెందుతుందని పాఠకుడు తెలుసుకోవాలి; ఎందుకంటే ఆకాశాలకు, భూమికి మరియు వాటిలో ఉన్నవాటన్నింటికీ అల్లాహ్ మాత్రమే యజమాని. మరియు ప్రతి స్థితిలోనూ సర్వస్తోత్రాలు ఆయనకే చెందుతాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు పరలోకంలో కూడా సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే! మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు.﴿

[సూరతు సబా: 28]

ఆజ్ఞాపించే అధికారం ఆయనకే చెల్లు మరియు సృష్టితాలన్నీ ఆయన వైపునకే మరలించబడతాయి, వారిలోని పుణ్యాత్ములు మరియు పాపాత్ములు, విశ్వాసులు మరియు అవిశ్వాసులు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! మొదట (ఇహలోకంలో) మరియు చివరకు (పరలోకంలో) స్తుతింపదగినవాడు కేవలం ఆయనే! మరియు విశ్వన్యాయాధిపత్యం ఆయనదే. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.﴿

[సూరతుల్ ఖసస్: 70]

మరియు నిశ్చయంగా 'సర్వసామ్రాజ్యం' అల్లాహ్ ఆధీనంలో ఉంటుంది, మరియు ఆయనే పరలోకదినానికి యజమాని. కావున ఆయనతో పాటు ఎవరూ నిర్వాహకుడు లేడు, ఆయన అనుమతి లేకుండా ఎవరూ సంరక్షకుడు కానీ, సిఫారసు చేసేవాడు కానీ లేడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾తీర్పుదినానికి స్వామి.﴿

[సూరతుల్ ఫాతిహ: 5-7]

ఇది తెలిసినప్పుడు, మనకు దృఢంగా తెలిసినది ఏమంటే: అల్లాహ్ ప్రజలను తనను ప్రభువుగా అంగీకరించే సహజ స్వభావంపై సృష్టించాడని, సృష్టిపై వాదన స్థాపించబడటానికి వారి కొరకు ప్రవక్తలను పంపించాడని మరియు గ్రంథములను అవతరింపజేశాడని, మరియు వారికి వినికిడి, చూపు మరియు హృదయాలను ప్రసాదించాడని. మరియు ప్రజల సృష్టి యొక్క ఉద్దేశం వారు ఆయనను ఆరాధించటం మరియు ఆయనకు సాటిగా దేనినీ కల్పించకపోవటమే అని ఆయన ప్రజలకు వివరించాడు. మరియు సృష్టిని అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించమని, చెడు ముగింపు గురించి వారిని భయపెట్టమని, మరియు భూమ్యాకాశాలంత విశాలమైన స్వర్గం గురించి వారికి శుభవార్తనివ్వమని ఆయన తన ప్రవక్తలకు (వారిపై శాంతి కలుగుగాక) బాధ్యతను అప్పగించాడు. మరియు ప్రతి ప్రవక్తా తన జాతి వారికి శుభవార్తనిచ్చాడు మరియు వారిని హెచ్చరించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు﴿

[సూరతు నిసా: 163],

మరియు ప్రళయదినాన ప్రజల గమ్యం ఈ రెండు వర్గాలకు మరియు రెండు గమ్యాలకు వెలుపల ఉండదని అల్లాహ్ స్పష్టపరచి ఇలా పలికాడు:

﴾మరియు ఈ విధంగా మేము నీపై ఈ ఖుర్ఆన్ ను, అరబ్బీ భాషలో, దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము. దానితో నీవు ఉమ్ముల్ ఖురా (మక్కా) మరియు దాని చుట్టుప్రక్కల వారిని హెచ్చరించటానికి మరియు - దానిని గురించి ఎలాంటి సందేహం లేని - ఆ సమావేశ దినాన్ని గురించి హెచ్చరించేందుకు కూడా. (ఆ రోజు) ఒక వర్గం వారు స్వర్గానికి పోతారు, మరొక వర్గం వారు మండే నరకాగ్నిలోకి పోతారు.﴿

[సూరతు షూరా: 13]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾నిశ్చయంగా, ఇందులో పరలోక శిక్షకు భయపడే వారికి ఒక సూచన ఉంది. అది సర్వ మానవులను సమావేశ పరిచే రోజు! ఆ దినమున అందరూ హాజరవుతారు.

మరియు మేము దానిని కేవలం ఒక నియమిత కాలం వరకు మాత్రమే ఆపి ఉన్నాము.

ఆ దినం వచ్చినప్పుడు, ఆయన (అల్లాహ్) సెలవు లేనిదే, ఏ ప్రాణి కూడా మాట్లాడజాలదు. వారిలో కొందరు దౌర్భాగ్యులుంటారు మరికొందరు భాగ్యవంతులుంటారు.

దౌర్భాగ్యులైన వారు నరకాగ్నిలో చేరుతారు, అక్కడ వారు దుఃఖం వల్ల మూలుగుతూ ఉంటారు మరియు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు.

వారందులో శాశ్వతంగా, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు ఉంటారు. నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప! నిశ్చయంగా, నీ ప్రభువు తాను కోరిందే చేసేవాడు.

ఇక భాగ్యవంతులైన వారు, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు. నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప! ఇదొక ఎడతెగని బహుమానం.﴿

[సూరతు హూద్: 118-119]

ఇది దైవసందేశహరులు మరియు దైవప్రవక్తలందరూ (అలైహిముస్సలామ్) ఏకీభవించిన విషయం, మరియు అంతిమ దైవసందేశహరులు దీనిని అత్యంత దృఢంగా నొక్కి చెప్పారు. ముఆజ్ బిన్ జబల్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం, ఆయన ఇలా అన్నారు:

"ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక వాహనముపై కూర్చుని ఉండగా, నాకు మరియు ఆయనకు మధ్య జీను వెనుక భాగం తప్ప మరేమీ లేదు. అపుడు ఆయన “ఓ ముఆధ్ ఇబ్నె జబల్!” అన్నారు. దానికి నేను “లబ్బైక్ రసూలుల్లాహ్ వ సఅదైక్” [మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్] అన్నాను. తరువాత ఆయన కాస్త సమయం ప్రయాణించి, మళ్ళీ “ఓ ముఆధ్!” అన్నారు. దానికి నేను “లబ్బైక్ రసూలుల్లాహ్ వ సఅదైక్” అన్నాను. మళ్ళీ కాస్త సమయం ప్రయాణించి, ఆయన “ఓ ముఆధ్!” అన్నారు. దానికి నేను “లబ్బైక్ రసూలుల్లాహ్ వ సఅదైక్” అన్నాను. అపుడు ఆయన అడిగారు: “దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటో నీకు తెలుసా?” దానికి నేను “అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికే బాగా తెలుసు” అన్నాను. అపుడు ఆయన “దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే, దాసులు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ ఆయనకు సాటి కల్పించరాదు” అన్నారు. మళ్ళీ కాస్త సమయం ప్రయాణించాక, ఆయన “ఓ ముఆధ్ ఇబ్న్ జబల్!” అన్నారు. దానికి నేను “లబ్బైక్ రసూలుల్లాహ్ వ సఅదైక్” అన్నాను. అపుడు ఆయన అడిగారు: “వారు అలా చేసినప్పుడు అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటో నీకు తెలుసా?” దానికి నేను “అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికే బాగా తెలుసు” అన్నాను. అపుడు ఆయన అన్నారు: “అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే, ఆయన వారిని శిక్షించరాదు”.

[ముఆజ్ కథనం ముత్తఫఖున్ అలైహి సహీహ్ అల్ బుఖారి (5967) ముస్లిం (48)],

జాబిర్ ఉల్లేఖనం:

ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించినాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఆ రెండు అనివార్యమైన విషయాలు ఏమిటి?” ఆయన ఇలా పలికినారు “అల్లాహ్ కు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని స్థితిలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. మరియు ఎవరైతే ఆయనకు సాటి కల్పిస్తున్న స్థితిలో మరణిస్తారో వారు నరకం లోనికి ప్రవేశిస్తారు”

[సహీహ్ ముస్లిం (170)].

కాబట్టి ఈ తీర్పు మరియు పర్యవసానం ముస్లింలు కల్పించినది కాదు, వాస్తవానికి మీరు చూసినట్లు మరియు తెలుసుకున్నట్లుగా ఇది దైవిక తీర్పు. వీరు స్వర్గవాసులు మరియు వారు నరకవాసులు అని తీర్పునిచ్చేది ముస్లిం కాదు, కానీ ఇహలోకములో మరియు పరలోకములో తీర్పుచేసే అధికారము అల్లాహ్ కు మాత్రమే ఉన్నది.

అల్లాహ్ ఒక మనిషికి ఇస్లాం వైపునకు సన్మార్గమును ప్రసాదించినట్లైతే, అతనిపై విధి ఏమిటంటే అతను తన తల్లిదండ్రులను మరియు బంధువులను ఇస్లాం వైపునకు ఆహ్వానించడానికి శ్రమించాలి, తద్వారా బహుశా అల్లాహ్ వారికి కూడా ఇస్లాం వైపునకు సన్మార్గమును ప్రసాదించవచ్చు, అదే అల్లాహ్ యొక్క సరైన మార్గం, మరియు అది ప్రవక్తల (అలైహిమస్సలాం) మార్గం. అయితే ఒకవేళ మీ కుటుంబ సభ్యులు ఇస్లాంపై కాకుండా మరణించి ఉన్నట్లైతే, వారికి ఇస్లాం యొక్క ఆహ్వానం చేరలేదని మేము ఆశిస్తున్నాము. మరియు ఎవరైతే ఇస్లాం యొక్క ఆహ్వానం చేరక మరియు దాని గురించి తెలియక మరణిస్తారో; నిశ్చయంగా అల్లాహ్ వారికి అన్యాయం చేయడు, బదులుగా ప్రళయ దినాన అల్లాహ్ సృష్టితాలన్నింటినీ తిరిగి లేపినప్పుడు; ఇస్లాం యొక్క ఆహ్వానం చేరని వారిని ఆయన పరీక్షిస్తాడు, అప్పుడు అంగీకరించిన వాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు, మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు:-

“ముస్లిం తప్ప మరెవరూ స్వర్గంలో ప్రవేశించలేరు”

[ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2620) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1003) లో ఉల్లేఖించారు].

ఒకవేళ అతడు అవిధేయత చూపి అహంకరిస్తే, అతని అహంకారం, మూర్ఖత్వం మరియు అవిశ్వాసం కారణంగా అతన్ని నరకంలో ప్రవేశింపజేస్తాడు. మన దైవప్రవక్త ముహమ్మద్ పై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి కురియుగాక.

المصدر

قسم الإسلام

ملاحظات

--