Skip to content

ఖుర్ఆన్ అంటే ఏమిటి?

محاور التعريف بالإسلام
التعريف بالقرآن الكريم
مصدر الإجابة
قسم القرآن والكتب السابقة | كتاب: الإسلام دين رب العالمين، ص 15-16.
الباب / الفصل
(قسم القرآن والكتب السابقة)

السؤال

ఖుర్ఆన్ అంటే ఏమిటి?

الجواب

సర్వ ప్రశంసలు అల్లాహ్ కొరకే, ఇకపోతే నిశ్చయంగా అల్లాహ్ తన ప్రవక్తలకు మరియు సందేశహరులకు అలైహిస్సలాతు వస్సలాం స్పష్టమైన నిదర్శనాల ద్వారా మద్దతు తెలిపాడు, అవి అల్లాహ్ తరువాత వారి జాతుల ప్రజల మార్గదర్శకత్వానికి కారణమయ్యాయి. మరియు ప్రవక్తల అలైహిస్సలాతు వస్సలాం సూచనలన్నీ అదృశ్యమయ్యాయి. ఉదాహరణకు: సాలిహ్ అలైహిస్సలాం యొక్క ఒంటె మరియు మూసా అలైహిస్సలాం చేతి కర్ర, మరియు ఈసా అలైహిస్సలాం ద్వారా కుష్టు రోగిని, మూగవాడిని నయం చేయటం మరియు చనిపోయినవారిని బ్రతికించడం. వాటిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప అద్భుతం మినహా ఏదీ మిగిలి లేదు. మరియు ఆయన గొప్ప అద్భుతమైన పవిత్ర ఖుర్ఆన్ దైవప్రవక్తలకు ఇవ్వబడిన అద్భుతాలలో మహా గొప్పది, అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పలికారు:

«దైవప్రవక్తల్లోని ప్రతీ ఒక్క ప్రవక్తకు అద్భుతాలు ఇవ్వబడ్డాయి,ఆ ప్రకారంగా ప్రజలు విశ్వసించేవారు,నిశ్చయంగా నాకు దైవవాణి ఇవ్వబడింది,అల్లాహ్ దాన్ని నా వైపుకు పంపాడు,కాబట్టి ప్రళయదినాన అత్యధిక అనుచరులు నాకు ఉంటారని నేను ఆశిస్తున్నాను»

[ముత్తఫఖున్ అలైహి: సహీహ్ బుఖారీ (7274), సహీహ్ ముస్లిం (239)].

మరియు అల్లాహ్ ఆయనకు ఇచ్చిన ఈ దైవవాణి: ఖుర్ఆను మరియు దైవప్రవక్త సున్నతు (సంప్రదాయం), మరియు ప్రశ్న ఖుర్ఆను గురించి కాబట్టి, మనం ఇక్కడ పవిత్ర ఖుర్ఆను గురించిన విషయాన్ని వివరంగా తెలుపుతూ ఇలా చెబుతున్నాము:

ఖుర్ఆను దివ్యగ్రంధం గురించి దానిని అవతరింపజేసిన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం).

దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు ١٩٣

నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని

స్పష్టమైన అరబ్బీ భాషలో!

నిశ్చయంగా, దీని (ప్రస్తావన) పూర్వ దివ్యగ్రంథాలలో ఉంది.﴿

[షు'అరా: 192-196]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾దీని (ఈ ఖుర్ఆన్) అవతరణ అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత తరఫు నుండి జరిగింది.

దివ్యగ్రంథం. దీని సూక్తులు (ఆయాత్) వివరించబడ్డాయి, ఇది జ్ఞానులైన ప్రజల కోసం అరబ్బీ భాషలో ఉన్న ఖురాన్.

(స్వర్గపు) శుభవార్తనిచ్చేదిగా మరియు హెచ్చరించేదిగా; అయినా చాలా మంది దీని పట్ల విముఖత చూపుతున్నారు, కాబట్టి వారు వినటం లేదు.﴿

[ఫుస్సిలత్ : 2-4]

﴾నిశ్చయంగా, తమ దగ్గరకు హితబోధ వచ్చినపుడు దానిని తిరస్కరించే వారే (నష్టపోయేవారు). మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) చాలా శక్తివంతమైన (గొప్ప) గ్రంథం;

అసత్యం దాని (ఖుర్ఆన్) ముందు నుండి గానీ లేదా దాని వెనుక నుండి గానీ దాని పైకి రాజాలదు. అది మహా వివేకవంతుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు, అయిన ఆయన (అల్లాహ్) తరఫు నుండి అవతరింప జేయబడింది.﴿

﴾నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ దివ్యమైనది.

సురక్షితమైన గ్రంథంలో ఉన్నది

దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ ముట్టుకోరు

ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడింది.﴿

[అల్ వాఖిఅ: 77 - 80]

మరియు దీనిని అవతరింపజేసిన అల్లాహ్ యే తౌరాతు మరియు ఇంజీలును అవతరింపజేశాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఆయన, సత్యమైన ఈ దివ్యగ్రంథాన్ని (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాడు. ఇది పూర్వం అవతరింపజేయబడిన గ్రంథాలలో నుండి (మిగిలి వున్న సత్యాన్ని) ధృవపరుస్తోంది. మరియు ఆయనే తౌరాత్ ను మరియు ఇంజీలును అవతరింపజేశాడు.

దీనికి ముందు ప్రజలకు సన్మార్గం చూపటానికి, మరియు (సత్యాసత్యాలను విశదీకరించే) ఈ గీటురాయిని కూడా అవతరింపజేశాడు. నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను తిరస్కరిస్తారో వారికి కఠినశిక్ష ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు.﴿

[ఆలె ఇమ్రాన్: 3-4]

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి ఇలా పలికారు:

«అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో మీకంటే పూర్వం గడిచిన వారి సమాచారం, మీ తరువాత రాబోయే విషయాల సమాచారం మరియు మీ మధ్య వ్యవహారాలను పరిష్కరించే తీర్పు ఉన్నాయి. మరియు అది సత్యాసత్యాలను స్పష్టంగా వేరు చేసేది, అది ఎగతాళి కాదు. దానిని వదిలివేసే ఏ అహంకారిని అయినా అల్లాహ్ నాశనం చేస్తాడు, మరియు దానిని వదిలి వేరొక దానిలో మార్గదర్శకత్వాన్ని వెతికే వాడిని అల్లాహ్ మార్గభ్రష్టుని చేస్తాడు. మరియు అది అల్లాహ్ యొక్క పటిష్టమైన త్రాడు, మరియు అది జ్ఞానపూర్వకమైన ఉద్బోధ, మరియు అది ఒక రాచమార్గము. అది ఎటువంటిదంటే, దాని వల్ల మనోవాంఛలు దారితప్పవు, మరియు దాని వల్ల నాలుకలు తడబడవు, విద్వాంసులకు దాని జ్ఞానంతో ఎన్నటికీ తృప్తి తీరదు, దానిని పదే పదే పఠించినా అది పాతబడదు, మరియు దానిలోని అద్భుతాలు ఎన్నటికీ అంతం కావు. జిన్‌లు దానిని విన్నప్పుడు, వారు ఇలా అనకుండా ఉండలేకపోయారు: ﴾నిశ్చయంగా మేము ఒక అద్భుతమైన ఖుర్ఆన్‌ను విన్నాము, అది సన్మార్గం వైపునకు మార్గదర్శకత్వం వహిస్తుంది...﴿ [అల్ జిన్: 2]. దాని ఆధారంగా మాట్లాడిన వాడు సత్యమే పలికాడు, మరియు దానిపై ఆచరించిన వానికి ప్రతిఫలం లభిస్తుంది, మరియు దానితో తీర్పు ఇచ్చిన వాడు న్యాయం చేశాడు, మరియు దాని వైపునకు పిలిచిన వాడు రాచమార్గము వైపునకు మార్గదర్శకత్వం చేయబడతాడు.»

[సుననె తిర్మిథీ త. షాకిర్, హదీథు సంఖ్య (2906) మరియు సునన్ దారిమీ, హదీథు సంఖ్య (2650)].

మరియు ఖురైష్ అవిశ్వాసులలో ఒకడైన వలీద్ దానిని విన్న తరువాత దాని గురించి ఇలా అన్నాడు:

"«అల్లాహ్ సాక్షిగా! నేను కొద్దిసేపటి క్రితమే ముహమ్మద్ నుండి కొన్ని మాటలు విన్నాను. అవి మానవుల మాటలు కావు, అలాగే జిన్నాతుల మాటలు కూడా కావు. నిశ్చయంగా ఆ మాటలలో ఎంతో మాధుర్యం ఉంది, వాటికి ఎంతో ఆకర్షణ ఉంది. దాని పైభాగం ఫలవంతమైనది, దాని కింది భాగం సమృద్ధిగా ఉన్నది. నిశ్చయంగా అది అత్యున్నతంగా ఉంటుంది, దానిని ఏదీ అధిగమించలేదు.»"

[మరాహ్ లబీద్ లి కష్ఫ్ మఅనల్ ఖుర్ఆనుల్ మజీద్ (2/ 580)].

మరియు ఖుర్ఆన్ మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు, ఇది జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా అక్షర జ్ఞానం లేని ప్రవక్త అయిన మన దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపబడినది, దాని పారాయణంతో ఆరాధన చేయబడుతుంది. ఇది అంతకు ముందు ప్రవక్తలపై అవతరింపబడిన తౌరాత్ మరియు ఇంజీల్ లాంటి పూర్వ గ్రంథాలను రద్దు చేసేది మరియు వాటిని ధృవీకరించే గ్రంథం. అనగా, తౌహీద్ (ఏకదైవారాధన) వైపుకు ఆహ్వానించడం, అగోచర విషయాలపై మరియు పునరుత్థానంపై విశ్వాసం ఉంచడం మరియు సాధారణంగా విశ్వాస (అఖీదా) మూలాలలో ఇవి ఏకీభవిస్తాయని దీని అర్థం. ఇది మన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఇరవై మూడు సంవత్సరాల వ్యవధిలో అవతరించినది. సహాబాలు దీనిని కంఠస్థం చేశారు మరియు వారి తరువాత వారికి వ్రాతపూర్వకంగా మరియు కంఠస్థం ద్వారా చేరవేశారు. కావున ఇది హృదయాలలో భద్రంగా ఉంది మరియు పుస్తకాలలో వ్రాయబడి భద్రంగా ఉంది. ముస్లింలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు మరియు దాని అక్షరాలను మరియు పఠన విధానాలను తరతరాలుగా పారంపర్యంగా చేరవేశారు. ఇది ముప్పై జుజ్ లు (భాగాలు) గా ఉంది మరియు ఇందులో నూట పద్నాలుగు సూరాలు ఉన్నాయి.

మరియు ఇది ఒక గొప్ప గ్రంధం. ఇది విశ్వాసం, శాసనాలు, మర్యాదలు, ప్రవక్తల కథలు మరియు పూర్వపు సమాజాల సమాచారాన్ని కలిగి ఉంది. అల్లాహ్ ఇందులో ప్రపంచంలో విశ్వాసులను ఎలా రక్షించాడో, మరియు ప్రపంచంలో అవిశ్వాసులను మరియు కపటులను ఎలా శిక్షించాడో పేర్కొన్నాడు. మరియు ఇది ప్రళయ దినాన విశ్వాసుల గమ్యం మరియు అవిశ్వాసుల, కపటుల గమ్యం యొక్క వివరణను కలిగి ఉంది. మరియు అల్లాహ్ మానవులు మరియు జిన్ లకు - వారు ఏకమైనప్పటికీ - ఇటువంటి దానిని తయారు చేసుకురండి అని ఛాలెంజ్ చేశాడు. ఇక ఇటువంటి దానిని లేదా దీనిలో కొంత భాగాన్నైనా తయారు చేసుకురావడం అటుంచితే, దీనిని మార్చడం ఎవరివల్లా కాలేదు మరియు ఎప్పటికీ సాధ్యం కాదు. మరియు అల్లాహ్ సుబహానహు వతఆలా ఈ ఖుర్ఆన్ ఆత్మ మరియు శరీర వ్యాధులన్నింటికీ నివారణ అని వివరించాడు. మరియు ఇందులో ఉన్నదాని ద్వారా సలహా పొందాలనుకునేవారికి మరియు దీని ద్వారా మార్గదర్శకత్వం పొందాలనుకునేవారికి ఇందులో సలహా ఉంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు హితోపదేశం (ఈ ఖుర్ఆన్) వచ్చింది మరియు ఇది మీ హృదయాల (రోగాల) కు స్వస్థత నిస్తుంది. మరియు విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు కారుణ్యం (ప్రసాదిస్తుంది).﴿

[యూనుస్: 57]

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశం అంతిమ సందేశం అయినందున - అనగా ఆయన తరువాత ఏ ప్రవక్తా రాడు కాబట్టి; అల్లాహ్ ఈ సందేశం యొక్క అద్భుతాన్ని తీర్పు రోజు వరకు మిగిలి ఉండిపోయే ఒక అద్భుతంగా నిలబెట్టాడు. అనగా దానిని పరిశీలించిన మరియు చదివిన ప్రతి ఒక్కరిపై ఈ సందేశం యొక్క సత్యానికి మరియు దానిని తీసుకువచ్చిన ప్రవక్త, అనగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత్వానికి ఆధారం స్థాపించబడుతుంది. అందువల్ల అల్లాహ్ ఖుర్ఆన్ లో ధర్మ మూలాలపై బుద్ధిని ఆశ్చర్యపరిచే మరియు హృదయాలను ఆకట్టుకునే స్పష్టమైన సాక్ష్యాలు, స్పష్టమైన ఆధారాలు మరియు రుజువులను ఉంచాడు. అందువల్ల వేలాది మంది మానవులు దానిని లేదా దాని భావాల అనువాదాన్ని పరిశీలించినప్పుడు ఇస్లాం స్వీకరిస్తూనే ఉన్నారు. మరియు అందులో ఉదాహరణలు, బుద్ధిపూర్వక ఆధారాలు మరియు దివ్యఖుర్ఆన్ మానవుడిని ఎదుర్కొనే ప్రశ్నలు ఉన్నాయి; అతను న్యాయవంతుడైతే వాటిని అంగీకరించేలా చేస్తాయి, లేదా అతను కృతఘ్నుడు మరియు సత్యాన్ని తిరస్కరించేవాడైతే మొండితనం మరియు అహంకారం చూపేలా చేస్తాయి. మరియు ఈ అద్భుతమైన ఆధారాల లో మహోన్నతుడైన అల్లాహ్ వాక్యం ఇలా ఉంది:

﴾ఓ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు; అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది.﴿

[హజ్జ్: 5]

అల్లాహ్ వాక్కు:

﴾వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా! కావున సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువైన అల్లాహ్! వారు కల్పించే కల్పనలకు అతీతుడు.﴿

[అల్ అంబియా :23]

మరియు నిరుత్తరులను చేసే ప్రశ్నలలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా?

ఏమీ? మీరా, దానిని సృష్టించేవారు? లేక మేమా దాని సృష్టికర్తలము?

మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు;

మీ రూపాలను మార్చి వేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి.

మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు?

మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా?

మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము?

మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు.﴿

మరియు అల్లాహ్ కాకుండా ఇతరుల ఆరాధన సరికాదనటానికి ఆధారాన్ని చూపుతూ ఖుర్ఆన్ ఇచ్చిన ఉదాహరణలలో మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఓ మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది, దానిని శ్రద్ధగా వినండి! నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. మరియు ఒకవేళ, ఆ ఈగ వారి నుండి ఏమైనా లాక్కొని పోయినా, వారు దానిని, దాని (ఆ ఈగ) నుండి విడిపించుకోనూ లేరు. ఎంత బలహీనులు, ఈ అర్థించేవారు మరియు అర్థించబడేవారు.﴿

మరియు ఇది పొరపాట్లు మరియు వైరుధ్యాలకు అతీతమైన గ్రంథం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾ఇది (ఈ ఖుర్ఆన్) ఒక దివ్య గ్రంథం; ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. దైవభీతి గలవారికి ఇది మార్గదర్శకత్వము.﴿

[అల్ బఖర: 21]

﴾ఏమీ? వారు ఖుర్ఆన్ ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరఫు నుండి గాక ఇతరుల తరఫు నుండి వచ్చి వుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా! ﴿

[నిసా: 1]

మరియు ఖుర్ఆన్ స్పష్టమైన అరబీ భాషలో అవతరింపబడినది, అది తన వాగ్ధాటి మరియు స్పష్టతతో అరబ్బులను ఆశ్చర్యపరిచింది. మరియు ఈ గొప్ప భాషా అద్భుతం యొక్క విలువను, అది ఎవరి భాషలో అవతరించిందో ఆ భాషా ప్రజలు మాత్రమే గ్రహించగలరు. మరియు అది ఏ భాషలో అవతరింపబడినదో అదే భాషలో సురక్షితంగా ఉంది, మరియు ముస్లింలు దానిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పఠించిన విధంగానే పఠిస్తారు.

పవిత్ర ఖుర్ఆన్‌కు తజ్వీద్, భాష్యం, అవతరణ కారణాలు మరియు ఇతరాల వంటి అనేక శాస్త్రాలు ఉన్నాయి. వీటిపై పండితులు కష్టపడితే తప్ప లెక్కించలేనన్ని ప్రసిద్ధ గ్రంథాలను రచించారు. మరియు ఖుర్ఆన్ యొక్క అర్థాలకు అనేక భాషలలో ప్రామాణికమైన అనువాదాలు ఉన్నాయి.

కాబట్టి తమ మానవత్వానికి విలువనిచ్చే మరియు తమ బుద్ధిని గౌరవించే ప్రతి ఒక్కరూ, మానవాళికి దీనికంటే ఉత్తమమైన గ్రంథం మరేదీ రాని ఈ మహా దివ్యగ్రంథాన్ని చదవడానికి కృషి చేయాలి, లేదా ఒకవేళ అరబీ భాష తెలియకపోతే దాని అనువాద అర్ధం చదవాలి. అత్యంత వివేకవంతుడైన ఒక వివేకి ఒక పుస్తకాన్ని వ్రాశాడని మరియు అతను తన వివేకాన్నంతా అందులో పొందుపరిచాడని ఒక బుద్ధిమంతుడికి చెప్పబడితే, దానిని చదివి తెలుసుకోవడానికి కృషి చేయడం మనిషికి ఎంతైనా తగును. అలాంటప్పుడు ఓ మానవుడా! నీ చేతుల్లో ఒక దైవ గ్రంథం ఉంది, ఇది ఏ భాషలో అవతరించినదో అలాగే ఈ రోజు వరకు అదే భాషలో భద్రంగా ఉంది, ఏ అక్షరమైనా తగ్గడం గానీ పెరగడం గానీ లేకుండా, మార్చడం గానీ జరుగకుండా సురక్షితంగా ఉంది, అందులో గతించిన వారి వృత్తాంతాలు, గతించిన మరియు ఉన్నవారి ధర్మ చట్టాలు మరియు ప్రతి ప్రాణి గమ్యం గురించిన వివరణలు ఉన్నాయి, అయినా నీవు దానిని చదివి తెలుసుకోవా! నిశ్చయంగా మనిషి ఖుర్ఆన్‌ను నిర్లక్ష్యం చేయడం మరియు దాని పట్ల శ్రద్ధ వహించకపోవడం ఖుర్ఆను కరీంకు ఎలాంటి నష్టం కలిగించదు, దానికి బదులుగా విముఖత చూపే ఆ వ్యక్తినే అది నష్టపరుస్తుంది; ఎందుకంటే అల్లాహ్ తన సృష్టితాల అవసరం లేనివాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు ఈ ఖుర్ఆన్ ను చదివి వినిపించాలని కూడా (ఆజ్ఞ ఇవ్వబడింది). కావున మార్గదర్శకత్వం పొందినవాడు తన మేలుకే, మార్గదర్శకత్వం పొందుతాడు. మరియు మార్గభ్రష్టుడైన వాడితో అను: "నిశ్చయంగా, నేను హెచ్చరిక చేసేవాడను మాత్రమే!﴿

[అన్-నమ్ల్ : 88]

﴾కావున (అల్లాహ్ మార్గంలో) పాటుపడే వాడు నిశ్చయంగా, తన (మేలు) కొరకే పాటు పడుతున్నాడని (తెలుసుకోవాలి). నిశ్చయంగా, అల్లాహ్ సర్వలోకాల వారి అక్కర ఏ మాత్రం లేనివాడు.﴿

[అల్-అన్'కబూత్: 6].

అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.

المصدر

قسم القرآن والكتب السابقة كتاب: الإسلام دين رب العالمين، ص 15-16. قسم القرآن والكتب السابقة كتاب: الإسلام دين رب العالمين، ص 15-16.

ملاحظات

--