ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ రకమైన మహిమలతోనైనా పంపబడ్డారా?
- محاور التعريف بالإسلام
- التعريف بمحمد صلى الله عليه وسلمالتعريف بالنبي محمد صلى الله عليه وسلماليوم الآخر والمصيرالبعث بعد الموت
- مصدر الإجابة
- قسم النبوة
- الباب / الفصل
- (قسم النبوة)
السؤال
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ రకమైన మహిమలతోనైనా పంపబడ్డారా?
الجواب
మోజిజా (మహిమ లేదా అద్భుతం) అనగా అల్లాహ్ ఒక ప్రవక్త ద్వారా బహిర్గతం చేసే ఒక అసాధారణమైన, అస్వభావికమైన, మానవాతీతమైన, ప్రకృతికి అతీతమైన అతీంద్రియ చర్య లేదా సంఘటన. తన జాతి ప్రజలను ఆహ్వానించే క్రమంలో అది ఆయనకు ఒక భౌతిక వాదనగా ఉంటుంది. ఉదాహరణకు, ఇబ్రాహీం అలైహిస్సలాం అగ్నిలో వేయబడినప్పుడు అది ఆయనపై చల్లగా మరియు శాంతియుతంగా మారిన సూచన, మరియు మూసా అలైహిస్సలాం యొక్క సూచనలు - వాటిలో కర్ర, చెయ్యి మరియు వరదలతో సహా -, కుష్ఠురోగి మరియు పుట్టుగ్రుడ్డికి వైద్యం చేయటం, అల్లాహ్ ఆదేశముతో చనిపోయిన వారిని తిరిగి బ్రతికించటం వంటి ఈసా అలైహిస్సలాం సూచన. మరియు కొన్నిసార్లు అల్లాహ్ ఒక ప్రవక్తను పంపుతాడు కానీ ఆయనతో పాటు ఎలాంటి అసాధారణమైన సూచనను పంపకపోవచ్చు; బదులుగా ప్రవక్త యొక్క స్థితి, ఆయన రుజువర్తన, మరియు ఆయన తీసుకువచ్చిన వహీ (దైవవాణి) ఆయన అల్లాహ్ తరపున వచ్చిన ప్రవక్త అని నిరూపించడానికి సరిపోతాయి. తద్వారా ప్రజలు అబద్ధికుని నుండి సత్యవంతుడిని స్పష్టంగా గుర్తిస్తారు; అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు, అబ్దుల్లాహ్ బిన్ సలామ్ ఇలా అన్నారు:
«ప్రజలు ఆయన వద్దకు తండోపతండాలుగా వెళ్ళారు, అలా వెళ్ళిన వారిలో నేను కూడా ఉన్నాను. ఆయన ముఖం స్పష్టంగా చూసిన వెంటనే “ఇది ఒక అబద్ధాలకోరు ముఖం కాదు” అని నాకు తెలిసిపోయింది. ఆయన నుండి ప్రత్యక్షంగా నేను విన్న మొట్టమొదటి మాటలు ఇవి: ‘సలాంను వ్యాపింపజేయండి, అన్నం తినిపించండి, బంధుత్వ సంబంధాలను కొనసాగించండి, ప్రజలు నిద్రిస్తున్న వేళ నమాజు చేయండి; అలా చేస్తే మీరు ప్రశాంతంగా స్వర్గంలోకి ప్రవేశించగలరు.’»
[ముస్నద్ అహ్మద్ (23784), తిర్మిజీ (2485) మరియు ఇబ్నె మాజహ్ (1334)].
నిశ్చయంగా అల్లాహ్ తన ప్రవక్తలు మరియు తన సందేశహరులు అలైహిముస్సలాంకు స్పష్టమైన సూచనలు మరియు తిరుగులేని ఆధారాల ద్వారా మద్దతు తెలిపాడు. ఈ సూచనలు భిన్నంగా మరియు వివిధ రకాలుగా ఉన్నాయి, కానీ అల్లాహ్ ప్రతి ప్రవక్త యొక్క సూచనలను మానవులు విశ్వసించడానికి సరిపోయే విధంగా చేశాడు మరియు వాటి ద్వారా వారిపై ప్రమాణం నిలబెట్టబడుతుంది; తద్వారా అతను అల్లాహ్ చేత పంపబడిన ప్రవక్త అని వారు గ్రహిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«దైవప్రవక్తల్లోని ప్రతీ ఒక్క ప్రవక్తకు అద్భుతాలు ఇవ్వబడ్డాయి, ఆ ప్రకారంగా ప్రజలు విశ్వసించేవారు, నిశ్చయంగా నాకు దైవవాణి ఇవ్వబడింది, అల్లాహ్ దాన్ని నా వైపుకు పంపాడు, కాబట్టి ప్రళయదినాన అత్యధిక అనుచరులు నాకు ఉంటారని నేను ఆశిస్తున్నాను»
[ముత్తఫఖున్ అలైహి: సహీహ్ బుఖారీ (7274), సహీహ్ ముస్లిం (239)].
నిశ్చయంగా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక అద్భుత మహిమలతో పంపబడ్డారు. ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఈ విధంగా అన్నారు: "నిశ్చయంగా పండితులు ఇందులో వెయ్యి కంటే ఎక్కువ మహిమలను ఒకచోట చేర్చారు. వాటిలో అత్యంత ఆశ్చర్యకరమైనది మరియు గొప్ప అద్భుతం దివ్య ఖుర్ఆన్. దాని ముందు నుండి గానీ లేదా దాని వెనుక నుండి గానీ ఎలాంటి అసత్యం దాని దరిచేరదు. అది మహా వివేకవంతుడు, ప్రశంసనీయుడు అయిన అల్లాహ్ తరఫున అవతరింపజేయబడినది. దాని అద్భుతం దాని పదాలు మరియు అర్థాల పరంగా ఉంటుంది. దాని పదాల విషయానికొస్తే, అవి వాక్చాతుర్యం యొక్క అత్యున్నత శిఖరాలలో ఉన్నాయి. ఈ విషయంలో ఎవరికైతే జ్ఞానం పెరుగుతుందో, వారికి ఖుర్ఆన్ పట్ల గౌరవం మరింతగా పెరుగుతుంది. ఆయన కాలంలోని గొప్ప వక్తలు మరియు భాషా పండితులకు ఆయనతో తీవ్రమైన శత్రుత్వం ఉన్నప్పటికీ, మరియు ఆయనను అసత్యవాదిగా నిరూపించాలనే తీవ్ర ఆసక్తి ఉన్నప్పటికీ, దానికి సాటివచ్చే దానిని, లేదా దానికి సమానమైన పది సూరాలను, లేదా కనీసం ఒక సూరానైనా తీసుకురమ్మని ఆయన వారిని సవాలు చేశారు, కానీ వారు అశక్తులయ్యారు. వారు దానిని ఎప్పటికీ తీసుకురాలేరని ఆయన వారికి తెలియజేశారు. అంతేకాకుండా, దానికి సాటివచ్చే దానిని తీసుకురమ్మని ఆయన జిన్నులు మరియు మానవులందరినీ సవాలు చేశారు, కానీ వారు అశక్తులయ్యారు. ఆయన వారికి ఆ విషయాన్ని తెలియజేశారు.మహోన్నతుడైన అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు:
﴾ఇలా అను: "ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి, ఈ ఖుర్ఆన్ వంటి దానిని కల్పించి తీసుకు రావటానికి ప్రయత్నించినా - వారు ఒకరి కొకరు తోడ్పడినప్పటికీ - ఇటువంటి దానిని కల్పించి తేలేరు.﴿
[సూరా అల్ ఇస్రా: 88]
దాని అద్భుతాన్ని నిరూపించే ఇతర అంశాలే కాకుండా, దాని భావార్ధాల విషయానికి వస్తే అవి అత్యంత సమన్వయం, వివేకం, అనుగ్రహం, ప్రయోజనం, ప్రశంసనీయమైన పరిణామం మరియు ఏకాభిప్రాయంతో కూడి ఉంటాయి. అంతేకాకుండా అత్యున్నత లక్ష్యాలను సాధించడం, అనర్థాలను నిర్మూలించడం లాంటి అనేక విషయాలు, సందేహాలు మరియు మనోవాంఛల నుండి విముక్తి పొందిన స్వచ్ఛమైన బుద్ధి మరియు జ్ఞానం గలవారికి స్పష్టంగా గోచరిస్తాయి. అటువంటి వాటి (సందేహాలు, మనోవాంఛల) నుండి మేము అల్లాహ్ శరణు కోరుతున్నాము మరియు ఆయన నుండి సత్య మార్గ దర్శకత్వాన్ని అర్థిస్తున్నాము.
దీనికి నిదర్శనాలలో ఒకటి ఏమిటంటే, తన వంశం, పెంపకం మరియు నడవడిక గురించి బాగా తెలిసిన ప్రజల మధ్య ఆయన పెరిగారు. ఆయన వారి మధ్య ఒక అనాథగా, నమ్మకస్తుడిగా, సత్యవంతుడిగా, పుణ్యాత్ముడిగా మరియు సన్మార్గంలో నడిచేవాడిగా పెరిగారు. వారందరికీ ఈ విషయం తెలుసు, పంతానికి పోయేవాడు, కుతర్కాలు చేసేవాడు మరియు అహంకారి తప్ప మరెవరూ దీనిని తిరస్కరించరు. ఆయన నిరక్షరాస్యుడు, ఆయనకు రాయడం రాదు, దానిని ఆయన అభ్యసించలేదు లేదా ఆ విద్య తెలిసిన వారితో సావాసం చేయలేదు. వారి ప్రాంతంలో పూర్వీకుల జ్ఞానం లేదు, దాని గురించి ఏమాత్రం తెలిసిన వారూ ఎవరూ లేరు. ఆపై, తన నలభైవ ఏట ఆయన వారి వద్దకు వచ్చి, గతించిన విషయాలను స్పష్టంగా మరియు సవివరంగా తెలియజేశారు. పూర్వ గ్రంథాలపై అవగాహన ఉన్న, సత్యం ద్వారా సన్మార్గం పొందిన పండితులు దీనిని ధృవీకరించారు... ఇంకా, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఈ ఖుర్ఆన్ లో మరియు ఆయన నుండి ఉల్లేఖించబడిన ప్రామాణిక హదీసులలో భవిష్యత్తుకు సంబంధించిన అగోచర (గైబ్) విషయాల గురించి తెలియజేసినవి ఆయన చెప్పినట్లే అక్షరాలా ఖచ్చితంగా జరిగాయి, అయితే వాటిని ఇక్కడ పూర్తిగా వివరించడం సుదీర్ఘమవుతుంది.
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఆయన చేతుల మీదుగా ప్రదర్శించిన గొప్ప అద్భుతాలు కూడా అందులోనివే. వాటిలో: అల్లాహ్ తన మహత్తర గ్రంథంలో చంద్రుడు రెండు ముక్కలుగా విరిగిపోవటం గురించి తెలియజేసినది కూడా ఉంది. అదేమిటంటే, ముష్రిక్కులు ఆయనను ఒక సూచన అడిగారు, అది రాత్రి సమయం, అప్పుడు ఆయన చంద్రుని వైపు సైగ చేయగానే అది రెండు ముక్కలుగా చీలిపోయింది. ఆయన తమపై మాయ చేశాడేమోనని వారు తమ చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రాంతాల వారిని విచారించారు, వారు కూడా సరిగ్గా వీరు చూసినట్లే వారితో చెప్పారు. పండితుల వద్ద ఇది ఆయన నుండి ముతవాతిర్ (అత్యంత ప్రామాణికం)గా నివేదించబడింది మరియు దీనిని పలువురు సహాబాలు రజియల్లాహు అన్హుమ్ అజ్మఈన్ ఉల్లేఖించారు.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆలలోని బర్కత్ వలన వెల్లడైన అద్భుతాలలో ఇవి కూడా ఉన్నాయి: ఇబ్నె మస్ఊద్ మేపుతున్న ఒక గొర్రెపిల్ల గురించి మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తో దుఆ చేశారు. ఆయన అల్లాహ్ నామాన్ని స్మరించి దాని పాలు పితికారు. అప్పుడు అది పాలు ఇచ్చింది, ఆయన స్వయంగా ఆ పాలను త్రాగి, అబూబక్ర్ కు కూడా త్రాగించారు. ఉమ్మె మబద్ గొర్రె విషయంలో కూడా ఆయన అలాగే చేశారు. తుఫైల్ బిన్ అమ్ర కోసం ఆయన దుఆ చేశారు, దానికి నిదర్శనంగా అతని కొరడా చివర దూరం నుండి కనిపించే ఒక ప్రకాశవంతమైన కాంతి వెలువడింది. ఒక చీకటి రాత్రి ఆయన దగ్గరి నుండి బయలుదేరిన ఉసైద్ బిన్ హుజైర్ మరియు అబ్బాద్ బిన్ బిష్ర్ అల్-అన్సారీలకు కూడా అలాగే జరిగింది. తాను నమాజు చేస్తున్నప్పుడు తనను ఎగతాళి చేసిన ఏడుగురిపై ఆయన అల్లాహ్ తో దుఆ చేశారు, దాని ఫలితంగా వారు బద్ర్ యుద్ధంలో చంపబడ్డారు. అబూ లహబ్ కుమారునికి వ్యతిరేకంగా ఆయన దుఆ చేశారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆకు అనుగుణంగా షామ్ (సిరియా) లో అల్లాహ్ అతనిపై ఒక క్రూరమృగాన్ని ఉసిగొల్పాడు. సురాఖాకు వ్యతిరేకంగా ఆయన దుఆ చేసినప్పుడు అతని గుర్రం ముందు కాళ్లు భూమిలో కూరుకుపోయాయి, ఆ తర్వాత ఆయన అల్లాహ్ తో దుఆ చేయగా అల్లాహ్ వాటిని విడిపించాడు. బద్ర్ యుద్ధంలో ఖురైష్ అవిశ్వాసుల వైపు ఆయన ఒక గుప్పెడు గులకరాళ్లను విసిరారు. అందులోని రాళ్లు వారిలో ప్రతి ఒక్కరికీ తగిలాయి మరియు అల్లాహ్ వారిని ఓడించాడు. హునైన్ యుద్ధం రోజున కూడా ఆయన అలాగే చేశారు. బద్ర్ యుద్ధం రోజున ఉకాషా బిన్ మిహ్సన్ కు ఆయన ఒక కట్టె ముక్కను ఇచ్చారు, అది అతని చేతిలో పదునైన కత్తిగా మారిపోయింది. తన పినతండ్రి అబ్బాస్ ఖైదీగా ఉన్నప్పుడు, ఆయనా మరియు ఉమ్మె ఫజ్ల్ కలిసి తమ ఇంటి గుమ్మం కింద దాచిపెట్టిన ధనం గురించి దైవప్రవక్త ఆయనకు తెలియజేశారు, అప్పుడు ఆయన ఆ విషయాన్ని అంగీకరించారు. బద్ర్ ఖైదీలను విడిపించుకోవడానికి వచ్చానని ఉమైర్ బిన్ వహబ్ సాకు చెప్పినప్పుడు, వాస్తవానికి తనను చంపడానికే వచ్చాడన్న విషయాన్ని దైవప్రవక్త ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన దానిని అంగీకరించి, ఆ క్షణమే ఇస్లాం స్వీకరించారు రజియల్లాహు అన్హు. ఉహుద్ యుద్ధం రోజున ఖతాదా బిన్ అన్-నుమాన్ అజ్-జఫరీ కన్ను బయటకు వచ్చి అతని చెంపపై పడినప్పుడు (మరికొందరి కథనం ప్రకారం అతని చేతిలో పడినప్పుడు), దైవప్రవక్త దానిని తిరిగి యథాస్థానంలో ఉంచారు. ఆ కన్ను అతని రెండు కళ్ళలోకెల్లా అత్యంత అందమైనదిగా మారింది, రెండవ కంటికి దానికి ఏమాత్రం తేడా తెలిసేది కాదు. ఖందఖ్ యుద్ధం రోజున జాబిర్ ఇంటి వద్ద ఉన్న ఒక గొర్రెపిల్ల మరియు ఒక సాఅ జొన్నలతో దాదాపు వెయ్యి మంది ఉన్న భారీ సమూహానికి ఆయన భోజనం తినిపించారు. అలాగే అదే రోజున బషీర్ కుమార్తె తెచ్చిన అతి కొద్ది ఖర్జూరాలతో కూడా ఎంతోమందికి భోజనం తినిపించారు. తన పవిత్రమైన చేతితో దాదాపుగా కప్పగలిగేంత అతి కొద్ది ఆహారంతో సుమారు ఎనభై మందికి ఆయన భోజనం పెట్టారు. జైనబ్ బింత్ జహ్ష్ తో తన వివాహ విందు రోజున కూడా ఆయన అలాగే చేశారు.
తబూక్ దండయాత్ర జరిగినప్పుడు ఒక అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది. ఒక మేక కూర్చునేంత పరిమాణంలో ఉన్న ఆహారంతో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సైన్యానికంతటికీ భోజనం పెట్టారు, వారు తమ వద్ద ఉన్న ప్రతి పాత్రనూ దానితో నింపుకున్నారు. హజ్రత్ అబూహురైర రజియల్లాహు అన్హుకు ఆయన ఒక ఆహారపు సంచిని ఇచ్చారు. ఆయన అందులోంచి తన జీవితకాలమంతా భుజించారు, అంతేకాకుండా దాని ద్వారా దైవమార్గంలో ఎంతో మందిని సన్నద్ధం చేశారు. హజ్రత్ ఉస్మాన్ హత్య చేయబడే రోజుల వరకు అది ఆయన వద్దనే ఉంది... కరువు సంభవించినప్పుడు ఆయన అల్లాహ్ ను ప్రార్థించారు (దుఆ చేశారు). ఆయన మింబర్ పై నుండి క్రిందికి దిగకముందే మస్జిద్ పైకప్పు నుండి నీరు కారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గడ్డం మీదుగా ప్రవహించసాగింది. అంతకు ముందు ఆకాశంలో ఏ మబ్బు గానీ, మేఘపు తునక గానీ, కనీసం అరచేయంత మేఘం కూడా కనిపించలేదు. ఆ తరువాత వాతావరణం నిర్మలంగా మారాలని ఆయన దుఆ చేసినప్పుడు, మదీనా పై నుండి మేఘాలు విడిపోయి, చివరికి మదీనా చుట్టూ కిరీటంలా మేఘాలు ఏర్పడ్డాయి. ఖురైషీయులకు వ్యతిరేకంగా ఆయన అల్లాహ్ తో దుఆ చేయగా, వారు వర్ణించలేనంత కష్టాలకు గురయ్యారు. చివరికి వారు కరుణించమని వేడుకోగా, ఆయన వారిని కరుణించి ఆ కష్టాల నుండి వారికి ఉపశమనం కలిగించారు. వుజూ చేసుకోవడానికి ఆయన వద్దకు ఒక నీటి పాత్ర తేబడింది. అక్కడున్న వారు కూడా ఆయనతో పాటు వజూ చేసుకోవాలని ఆశించారు. అప్పుడు ఆయన ఆ పాత్రలో తన చేయి పెట్టారు, కాని అది ఇరుకుగా ఉండటం వల్ల సరిపోలేదు. తరువాత ఆయన అల్లాహ్ తో దుఆ చేశారు, అప్పుడు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్రేళ్ల మధ్య నుండి నీరు ఉబుకసాగింది. హుదైబియా జరిగిన రోజున కూడా ఆయన ఇలాగే చేశారు. అప్పుడు సైన్యం ఒక వెయ్యి నాలుగు వందల మంది ఉన్నారు. (హజ్రత్) జాబిర్ ఇలా అన్నారు:
«ఒకవేళ మేము ఒక లక్ష మంది ఉన్నప్పటికీ, అది మాకు సరిపోయేది»,
అదేవిధంగా తన ప్రయాణాలలో ఒకదానిలో ఒక నీటి సంచిలో ఉన్న ఒక నీటి బొట్టుతో కూడా ఆయన ఇలాగే చేసినారు. ఉల్లేఖీకుడు ఇలా తెలిపారు: ఆ నీటిని ఒక పాత్రలో పోయమని ఆయన నన్ను ఆదేశించినపుడు, ఎండిపోయిన ఆ నీటి సంచి ఆ నీటిని పీల్చుకుంటుందేమో అని నేను భయపడ్డాను. అపుడు ఆయన అందులో తన చేతిని పెట్టి, అల్లాహ్ తఆలాను ప్రార్థించారు. అపుడు తన సహచరుల కోసం ఆయన చేతి వేళ్ల మధ్య నుండి నీటి ఊట ప్రవహించింది, దానితో వారు ఉదూ చేసుకుని త్రాగారు. అదేవిధంగా ఆయన తన బాణాన్ని హుదైబియా నీటి బుగ్గ లోకి పంపినారు, దానిని అందులో ఉంచినపుడు అది వారికి సరిపోయేంతగా నీటితో ఉప్పొంగింది.. ఇన్ షా అల్లాహ్ తఆలా, మేము ప్రస్తావించిన ఈ విషయాలు సరిపోతాయి.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తతను సూచించే గొప్ప సాక్ష్యాలలో ఒకటి ఆయన సందేశం నిలిచి ఉండటం. అది ఈ రోజు అవతరించినట్లుగానే, ఎలాంటి మార్పు లేకుండా వక్రీకరించకుండా అలాగే ఉంది. మరియు ఆయన ధర్మం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాజానికి అందజేసిన విధంగానే ఇప్పటికీ అమలుచేయబడుతోంది, దానిలో ఏదీ మారలేదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించిన నమాజు, అలాగే జకాతు, ఉపవాసం, హజ్జ్ మరియు తదితర ఇస్లామీయ విధులను ముస్లిములు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించిన విధంగానే నెరవేరుస్తున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయులు తమ ధర్మాన్ని ఇప్పటికీ సంరక్షించుకుంటూనే ఉన్నారు, మరియు ప్రతిరోజూ అన్ని జాతులు మరియు భాషలకు చెందిన వారు సమూహాలుగా ఈ ధర్మంలోకి ప్రవేశిస్తూనే ఉన్నారు. దీని వ్యవహారం మరింత సుస్థిరంగా మరియు విస్తృతంగా పెరుగుతోంది, మరియు పరిశోధించేవారు దీని వాస్తవికతను, దీని శ్రేయస్సును మరియు విశ్వాస, నైతిక, వ్యవహారాలు మరియు ధర్మశాసనాలలో దీని యోగ్యతను గ్రహిస్తారు.
మరియు ఇదంతా మత్తయి ఇంజీల్'లో ఈ విధంగా పేర్కొన్నట్లుగా, మసీహ్ అలైహిస్సలాం చేసిన హెచ్చరికకు విరుద్ధంగా ఉంటుంది: "గొర్రెపిల్లల వేషంలో మీ వద్దకు వచ్చే అబద్ధపు ప్రవక్తల పట్ల అప్రమత్తంగా ఉండండి, కానీ అంతర్గతంగా వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలాలను బట్టి మీరు వారిని గుర్తిస్తారు. ఎవరైనా ముళ్ళపొదల నుండి ద్రాక్షలను, లేదా గచ్చపొదల నుండి అంజూరపు పండ్లను కోస్తారా? అదే విధంగా ప్రతీ మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, అయితే చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలను ఇస్తుంది. ఒక మంచి చెట్టు చెడ్డ ఫలాలను ఇవ్వలేదు, మరియు ఒక చెడ్డ చెట్టు మంచి ఫలాలను ఇవ్వలేదు. మంచి ఫలాలను ఇవ్వని ప్రతీ చెట్టు నరకబడి అగ్నిలో విసిరివేయబడుతుంది. కనుక, వారి ఫలాలను బట్టి మీరు వారిని గుర్తిస్తారు" (మత్తయి 7: 15-20).
మరి అల్లాహ్ సాక్షిగా, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత యొక్క సత్యతను, ఆయన దైవదౌత్యపు పరిపూర్ణతను మరియు ప్రళయ దినం వరకు ఆయన ధర్మం నిలిచి ఉండటాన్ని సూచించే సాక్ష్యాలు, రుజువులు మరియు అద్భుతాలలో అతి గొప్పది. మరియు మన ప్రవక్త ముహమ్మద్ పై అల్లాహ్ యొక్క కారుణ్యము మరియు శాంతి కలుగుగాక.
చూడండి: అల్ ఫుసూల్ ఫీ అస్'సీర పేజీ 228-236.
المصدر
ملاحظات
--