Skip to content

ప్రళయదినం అంటే ఏమిటి?

محاور التعريف بالإسلام
اليوم الآخر والمصيرالحساب
مصدر الإجابة
قسم البعث | كتاب: الإسلام دين رب العالمين، ص 17-18.
الباب / الفصل
(قسم البعث)

السؤال

ప్రళయదినం అంటే ఏమిటి?

الجواب

సకల ప్రశంసలు అల్లాహ్ కొరకే. ప్రళయదినం ఒక గొప్ప దినం, పవిత్ర ఖుర్ఆన్‌లో దీనికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో సంభవించే అనేక భయానక పరిస్థితులు మరియు సంఘటనల కారణంగానే దానికి ఇన్ని పేర్లు వచ్చాయి. దీనికి తీర్పు దినం (యౌముల్ ఖియామ), నష్టాల దినం (యౌముత్ తగాబున్), చెవులను చెవిటిగా చేసేది (అస్సాఖ్ఖ), గుండెలను దడదడలాడించేది (అల్ ఖారిఅ), పునరుత్థానం (అల్ బఅస్), సమీకరణ (అల్ హష్ర్), పునర్జీవనం (అన్ నుషూర్), పిలుపుల దినం (అత్తనాద్), భూకంపం (అజ్ జల్జల) మరియు గొప్ప విపత్తు (అత్తామ్మ) వంటి అనేక ఇతర పేర్లు ఉన్నాయి.

మరియు ఈ రోజు సమయం అల్లాహ్ కు తప్ప ఎవరికీ తెలియదు, దీని గురించి ఏ పంపబడిన దైవప్రవక్తకు కూడా, ఏ సామీప్య దైవదూతకు కూడా తెలియదు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-

﴾నిశ్చయంగా, తీర్పు ఘడియ రానున్నది, ప్రతి వ్యక్తీ తాను చేసిన కర్మల ప్రకారం ప్రతిఫలం పొందటానికి; నేను దానిని గోప్యంగా ఉంచాలని నిర్ణయించాను.﴿

[తాహా : 50]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾(ఓ ప్రవక్తా!) వారు నిన్ను ఆ అంతిమఘడియను గురించి: "అది ఎప్పుడు రానున్నది?" అని అడుగుతున్నారు. వారితో ఇలా అను: "నిస్సందేహంగా, దాని జ్ఞానం నా ప్రభువుకు మాత్రమే ఉంది. కేవలం ఆయన స్వయంగా దానిని, దాని సమయంలో తెలియజేస్తాడు. అది భూమ్యాకాశాలకు ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగానే వచ్చి పడుతుంది." దానిని గురించి నీకు బాగా తెలిసి ఉన్నట్లు భావించి, వారు నిన్ను దానిని గురించి అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానం ఇవ్వు: "నిస్సందేహంగా, దాని జ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ఉంది. కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు.﴿

[అల్ ఆరాఫ్: 54]

ప్రళయం సంభవించక మునుపు దాని సూచనలు ఉంటాయి, అవే దాని సంకేతాలు. మరియు ప్రళయం యొక్క సంకేతాలు చాలా ఉన్నాయి, వాటిలో సంభవించి గడిచిపోయినవి ఉన్నాయి, మరియు యుగాంతము సమీపిస్తున్న కాలములో సంభవించే పది పెద్ద సంకేతాలు కూడా వాటిలో ఉన్నాయి. ఇవి హుజైఫా బిన్ ఉసైద్ అల్ గిఫారీ నుండి ఉల్లేఖించబడిన ఈ హదీసులో ప్రస్తావించబడినవి, ఆయన ఇలా పలికారు:

మేము చర్చలో నిమగ్నమై ఉన్న సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హఠాత్తుగా మా వద్దకు వచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "మీరు ఏమి చర్చిస్తున్నారు?" మేము ఇలా చెప్పాము: "మేము ప్రళయం గురించి చర్చిస్తున్నాము." అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీరు దాని ముందు పది సంకేతాలు చూసే వరకు అది రాదు.” - ఆయన వాటిని ప్రస్తావించారు - పొగ, దజ్జాల్, జంతువు, పశ్చిమం నుండి సూర్యోదయం, ఈసా బిన్ మర్యం అలైహిస్సలాం అవరోహణ, యాజూజ్,మాజూజ్ మరియు మూడు ప్రదేశాలలో భూకంపం రావటం గురించి ప్రస్తావించారు అవి: తూర్పున ఒకటి, పశ్చిమాన ఒకటి మరియు అరేబియాలో ఒకటి, మరియు వీటిలో చివరిది యమన్ నుండి ఉద్భవించే అగ్ని, ఇది ప్రజలను వారి సమీకరించబడే స్థానానికి (హషర్ మైదానము) తీసుకునివెళుతుంది.

[సహీహ్ ముస్లిం (170)].

మరియు ఆ రోజున ప్రజలు కాళ్ళకు చెప్పులు లేకుండా, నగ్నంగా, వొడుగులు (సున్తీ) చేయని స్థితిలో పునరుత్థానం చేయబడతారు (లేపబడతారు). లెక్కల తీర్పు కోసం ఎదురుచూస్తూ వారు చాలా కాలం పాటు నిలబడతారు. సూర్యుడు వారికి దగ్గరగా వస్తాడు, మరియు వారి నుండి విపరీతంగా చెమట కారుతుంది. అల్లాహ్ అందులో పూర్వీకులను మరియు తరువాతి వారందరినీ ఒకచోట సమీకరిస్తాడు. తాము ఉన్న ఈ విపత్కర స్థితి నుండి విముక్తి పొందడానికి శిఫారసు చేయమని ప్రజలు ప్రవక్తలను (అలైహిస్సలాం) అర్థిస్తారు. అప్పుడు సృష్టితాల పక్షాన అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క శిఫారసును అంగీకరిస్తాడు. కావున లెక్కల తీర్పు చేయమని ఆయన తన ప్రభువుకు శిఫారసు చేస్తారు. ఆ రోజున ఎన్నో భయానక పరిస్థితులు, ఆందోళనలు మరియు అనేక దృశ్యాలు ఉంటాయి, వీటి పూర్తి వివరాలు గ్రంథం మరియు ప్రామాణిక సున్నతులలో వివరించబడ్డాయి.

మరియు ఆ రోజున ప్రతీ సమాజము తమ ప్రవక్తతో వస్తుంది, అప్పుడు ఆయన వారిపై సాక్ష్యమిస్తాడు. మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజము, ప్రతీ ప్రవక్త సందేశాన్ని చేరవేశారని మరియు అమానతును నెరవేర్చారని సాక్ష్యమిస్తుంది. మరియు ఆ రోజున దాసుల కర్మల పుస్తకాలు తెరవబడతాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు కర్మపత్రం వారి ముందు ఉంచబడినపుడు, ఆ అపరాధులు, అందులో ఉన్న దానిని చూసి భయపడటాన్ని నీవు చూస్తావు. వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం, ఇదేమి గ్రంథం! ఏ చిన్న విషయాన్న గానీ, ఏ పెద్ద విషయాన్ని గానీ ఇది లెక్కపెట్టకుండా విడువ లేదే!" తాము చేసిందంతా వారు తమ ఎదుట పొందుతారు. నీ ప్రభువు ఎవ్వరికీ అన్యాయం చేయడు.﴿

[ అల్ కహఫ్: 49]

మరియు దాసుల ఆచరణలను తూకం వేయడానికి తూకములు ఏర్పాటు చేయబడతాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము. కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్క చూడటానికి మేమే చాలు!﴿

[అల్ అంబియా :23]

మరియు సాక్షులు హాజరుపరచబడతారు, మరియు తీర్పును నిర్ణయించడానికి మహాబలవంతుడైన అల్లాహ్ వస్తాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు భూమి తన ప్రభువు తేజస్సుతో వెలిగి పోతుంది మరియు కర్మపత్రం వారి యెదుట ఉంచబడుతుంది, ప్రవక్తలు మరియు (ఇతర) సాక్షులు రప్పింపబడతారు. మరియు వారి మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు వారికెట్టి అన్యాయం జరుగదు.﴿

[జుమర్: 42]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు.﴿

[అల్ ఫజ్ర్: 27-30]

అది ఇహలోక జీవితంలో ప్రజలు చేసిన కర్మలకు ప్రతిఫలం మరియు లెక్క తీసుకునే దినం, కనుక ఎవరి తూకము బరువుగా ఉంటుందో వారు సఫలీకృతులు మరియు రక్షింపబడిన వారిలో ఉంటారు, మరియు ఎవరి తూకము తేలికగా ఉంటుందో వారే నష్టపోయినవారు, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:

﴾అప్పుడు (జరిగిందంతా) వారికి పూర్తి జ్ఞానంతో వివరిస్తాము. ఎందుకంటే, మేము (ఎక్కడనూ, ఎప్పుడునూ) లేకుండా లేము.

మరియు ఆ రోజు (కర్మల) తూకం న్యాయంగా జరుగుతుంది. కావున ఎవరి తూనికలు బరువుగా ఉంటాయో అలాంటి వారే సఫలీకృతలు.

మరియు ఎవరి తూనికలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేస్తుకున్నవారు. ఎందుకంటే, వారు మా సూచనలను దుర్మార్గంతో తిరస్కరిస్తూ ఉండేవారు.﴿

లెక్కల అప్పచెప్పులు ముగిసిన తరువాత విశ్వాసులు స్వర్గానికి తీసుకువెళ్లబడతారు, అది అంతు లేని శాశ్వతమైన అనుగ్రహాల నిలయం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో వారు మరియు వారితో పాటు సద్వర్తనులైన వారి తండ్రి తాతలు, వారి సహవాసులు (అజ్వాజ్) మరియు వారి సంతానం కూడా ప్రవేశిస్తారు. మరియు ప్రతి ద్వారం నుండి దేవదూతలు వారి (స్వాగతం) కొరకు వస్తారు.﴿

[రఅద్: 23]

మరియు అవిశ్వాసపరులైన అపరాధులు నరకం వైపునకు తోలుకొని పోబడతారు, అది అంతం లేని శాశ్వతమైన శిక్ష మరియు వేదనల నివాసం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴾మరియు సత్యతిరస్కారులైన వారి కొరకు నరకాగ్ని ఉంటుంది. అందులో వారు చనిపోవాలనీ తీర్పూ ఇవ్వబడదు, లేదా వారికి దాని (నరకపు) శిక్ష కూడా తగ్గింప బడదు. ఈ విధంగా, మేము ప్రతి కృతఘ్నునికి (సత్యతిరస్కారునికి) ప్రతీకారం చేస్తాము.﴿

[ఫాతిర్: 36]

మరియు అవిశ్వాసపరులు తమ ప్రతిఫలాన్ని, మరియు విశ్వాసపరులు తమ పుణ్యఫలాన్ని పొందిన పిమ్మట, దైవదూతలు తమ ప్రభువును ఆయన పరిపూర్ణమైన న్యాయంపై మరియు ఆయన గొప్ప విజ్ఞతపై ప్రశంసిస్తారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా పలికాడు:

﴾మరియు దైవదూతలను తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన సింహాసనాన్ని (అర్ష్ ను) అన్ని వైపుల నుండి చుట్టుకొని ఉండటాన్ని నీవు చూస్తావు. మరియు వారి (సర్వ ప్రాణుల) మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు : "సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు." అని పలుకబడుతుంది.﴿

అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.

المصدر

قسم البعث كتاب: الإسلام دين رب العالمين، ص 17-18. قسم البعث كتاب: الإسلام دين رب العالمين، ص 17-18.

ملاحظات

--