Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 2 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి

ఉల్లేఖకుడు

“దైవవాణి అవతరణ (వహీ అవతరణకు) సంబంధించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి అనుభవంలోనికి వచ్చిన మొట్టమొదటి విషయం నిద్రలో ఆయన యొక్క శుభస్వప్నాలు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చూసిన ఏ స్వప్నము కూడా అరుణోదయం తనవెంట వెలుగు తీసుకువచ్చినట్లు నిజం కాకుండా పోలేదు. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏకాంతంగా గడపడం ఇష్టపడసాగినారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘హిరా’ గుహకు వెళ్ళిపోయేవారు, అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘తహన్నుత్’లో గడిపేవారు (తహన్నుత్: తనవెంట తగినంత ఆహారసామాగ్రి తీసుకుని వెళ్ళి, ఇంటికి, కుటుంబము వద్దకు తిరిగి వచ్చేదాకా బహు దూరంగా ఏకాంతములో ఆరాధనలో, స్వీయ మేధోమధనములో గడపడం). తరువాత తిరిగి ఖదీజహ్ (రదియల్లాహు అన్హా) వద్దకు వెళ్ళేవారు, మరల అన్ని రాత్రులకొరకు సరంజామా తీసుకుని వెళ్ళడానికి. అలా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) హిరా గుహలో ఉండగా చివరికి ‘సత్యం’ ఆయన వద్దకు వచ్చేసింది. ఆయన వద్దకు ఓ దైవదూత వచ్చి “చదువు” అని అన్నాడు. దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) “నాకు చదువు రాదు” అని పలికారు. ఈ విషయమై ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు: “అతడు (ఆ దైవదూత) నన్ను ఒడిసి పట్టుకుని నేను భరించలేనంత గట్టిగా నన్ను అదిమాడు. తరువాత నన్ను వదిలి తిరిగి అన్నాడు “చదువు”, దానికి నేను “నాకు చదవడం రాదు” అన్నాను, ఆ దైవదూత రెండోసారి నన్ను ఒడిసి పట్టుకుని నేను భరించలేనంత గట్టిగా నన్ను అదిమాడు. తరువాత నన్ను వదిలి తిరిగి అన్నాడు “చదువు”, దానికి నేను “నాకు చదవడం రాదు” అన్నాను, ఆ దైవదూత మూడోసారి నన్ను ఒడిసి పట్టుకుని నేను భరించలేనంత గట్టిగా నన్ను అదిమాడు. తరువాత ఇలా అంటూ నన్ను వదిలివేసాడు: “చదువు, నీ ప్రభువు నామమున, ఎవరైతే సర్వమూ సృష్టించినాడో; ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు, చదువు! నీ ప్రభువు పరమదయాళువు (సూరహ్ అల్ అలఖ్ 96:1-3)”. ప్రవక్త (స) ఈ మూడు వాక్యాలతో వెనుకకు మరలినారు. వారి గుండె వణుకుతున్నది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నేరుగా ఖదీజా బింత్ ఖువైలిద్ (రదియల్లాహు అన్హా) వద్దకు వెళ్ళి వణుకుతూ “నన్ను (దుప్పటితో) కప్పు, నన్ను (దుప్పటితో) కప్పు” అన్నారు. వారు ఆయనను కప్పినారు. అలా కొద్ది సేపటిని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుండి భయము, విభ్రాంత స్థితి దూరమైనాయి. తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖదీజాహ్ (రదియల్లాహు అన్హా) కు జరిగిందంతా వివరించి ఇలా అన్నారు: “నిజంగా, నా ప్రాణం పోతుందేమో అన్నంత భయం కలిగింది”. దానికి ఖదీజాహ్ (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు: “లేదు! అల్లాహ్ మిమ్మల్ని అగౌరవం పాలు చెయ్యడు. మీరు బంధువుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉంటారు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటారు, నిరుపేదలకు సహాయం చేస్తారు, అతిథులకు ఆహారాన్ని ఆశ్రయాన్ని ఇస్తారు, మరియు విపత్తుల బారిన పడిన వారికి సహాయం చేస్తారు” అని ధైర్యం చెప్పారు. తరువాత ఖదీజాహ్ (రదియల్లాహు అన్హా) ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను తన పినతండ్రి కుమారుడైన ‘వరఖ ఇబ్న్ నౌఫాల్ ఇబ్న్ అసద్ ఇబ్న్ అబ్దుల్ ఉజ్జా ఇబ్న్ ఉమ్మె ఖదీజహ్ వద్దకు తీసుకు వెళ్ళినారు. అఙ్ఞాన కాలములోనే వరఖా క్రైస్తవ ధర్మాన్ని స్వీకరించిన వ్యక్తి. హిబ్రూ (ఇబ్రానీ) భాషలో రచనలు చేసేవాడు. కనుక చేతనయినంత వరకు హిబ్రూ భాషలో బైబిల్ రాసేవాడు.అప్పుడు ఆయన వృద్ధుడూ మరియు చూపులేని వాడు కూడా. ఆయనతో ఖదీజాహ్ (రదియల్లాహు అన్హా) “అన్నా, మీ సోదర కుమారుని మాటలేమితో ఒకసారి వినండి” అని కోరినారు. దానికి వరఖా “ఓ నా సోదరుని కుమారుడా! నీవు చూసినది ఏమిటో చెప్పు” అన్నారు. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయనకు తాను చూసినది ఏమిటో వివరించినారు. అది విని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో వరఖా ఇలా అన్నారు “మూసా అలైహిస్సలాం వద్దకు దైవవాణిని పంపడానికి అల్లాహ్ పంపిన ‘నామూసే’ ఆయన (నామూస్: దైవదూత). నేను యవ్వనవంతునిగా ఉంటే ఎంత బాగుండును, నీ వాళ్ళు నిన్ను వెళ్లగొట్టే రోజు వరకు నేను జీవించి ఉంటే ఎంత బాగుండును”. అది విని రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విస్మయంగా “ఏమిటీ, నా వాళ్ళు నన్ను వెళ్ళగొడతారా?” అన్నారు. దానికి వరఖా ఇలా అన్నాడు: “అవును, నీవు తీసుకువచ్చిన దాని వంటి విషయముతో వచ్చిన వారెవరూ, వారి స్వంత మనుషులే వారితో శత్రువులుగా వ్యవహరించకుండా ఒక్కరూ లేరు. నేను ఆ రోజు వరకు జీవించి ఉంటే, నేను గట్టిగా మద్దతునిస్తాను.” తరువాత కొద్ది కాలానికే వరఖా చనిపోయాడు. అల్లాహ్ తరఫునుండి వహీ అవతరణ (దివ్యవాణి అవతరణ) కొద్ది రోజులపాటు నిలిచిపోయింది.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
«నేను నడుస్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది, అప్పుడు నేను నా దృష్టిని పైకి ఎత్తాను, అప్పుడు హీరా గుహలో నా వద్దకు వచ్చిన దైవదూత భూమికి మరియు ఆకాశానికి మధ్య ఒక కుర్చీపై కూర్చుని ఉన్నాడు. నేను అతనిని చూసి భయపడ్డాను. నేను తిరిగి వచ్చి ఇలా అన్నాను: నాపై దుప్పట కప్పండి. అప్పుడు అల్లాహ్ ఈ ఆయతులను అవతరింపజేశాడు: {ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!1 లే! ఇక హెచ్చరించు!} [ముద్దస్సిర్: 2] నుండి {మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!} [ముద్దస్సిర్: 5] ఈ ఆయతు వరకు. ఆ తర్వాత దైవవాణి అవతరణ ప్రక్రియ గొప్ప శక్తితో మరియు నిరంతరం కొనసాగింది».
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు