ఖుర్ఆన్ ప్రస్తావించే అంశాలు ఏమిటి?
- محاور التعريف بالإسلام
- التعريف بالقرآن الكريم
- مصدر الإجابة
- قسم القرآن والكتب السابقة
- الباب / الفصل
- (قسم القرآن والكتب السابقة)
السؤال
ఖుర్ఆన్ ప్రస్తావించే అంశాలు ఏమిటి?
الجواب
సకల ప్రశంసలు అల్లాహ్ కొరకే. దివ్యఖుర్ఆన్ అనేది అల్లాహ్ యొక్క వాక్కు, దివ్యగ్రంథాల పరంపరలో చిట్టచివరిది మరియు పూర్వగ్రంథాలను రద్దు చేసేది. ఇది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినది. ఇది భాగాలుగా విభజించబడినది, ప్రతి భాగం సూరాలుగా మరియు ప్రతి సూరా ఆయతులుగా విభజించబడినది. ఒక సూరా అనేది ఒకే అంశం గురించి లేదా వివిధ అంశాల గురించి ఉండవచ్చు.
ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అది యూదులు మరియు క్రైస్తవుల గ్రంథాలలో వలె ఒకసారి చదివితే బహుశా మీరు దానిని మళ్లీ చదవని విధంగా ఒక నిరంతర చారిత్రక కథనంగా ఉండదు. కానీ దానిలోని ప్రతి చోట ప్రవక్తల గాధల యొక్క గొప్ప వైవిధ్యం మరియు వాటి ద్వారా హితబోధన ఉన్నట్లు మనం పొందుతము, మరియు అల్లాహ్ యొక్క ఆయతులపై మరియు ఆయన అద్భుత సృష్టిపై దృష్టి సారించడానికి గల ఆధారాలు ఇమిడి ఉంటాయి. మరియు వీటి మధ్యలో ఆదేశాలు, నిషేధాలు, నైతిక విలువలు, మర్యాదలు మరియు ధర్మ శాసనాలు వస్తుంటాయి. ఇదంతా ఒక తోట లాంటిది, సాధారణంగా ఏ చోటనైనా ఖుర్ఆన్ను అధ్యయనం చేసినప్పుడు మానవుడు దాని ద్వారా ప్రయోజనం చెందగలడు. ఒక్క ప్రవక్త యొక్క గాధ కూడా కేవలం ఒకేసారి వచ్చి ముగిసిపోదు, కానీ అది అనేక సూరాలలో మరియు అనేక ప్రదేశాలలో వస్తుంది. మరియు ప్రతి చోట, లోతుగా ఆలోచించే పాఠకుడు దృష్టి సారించడానికి క్రొత్త ప్రయోజనాలు మరియు సంఘటనల పట్ల ఒక క్రొత్త కోణం ఉంటాయి.
అయితే ఖుర్ఆన్లో ప్రస్తావించబడిన విషయాలలో కొన్ని ఇవి:
- ఇది ఒక వ్యక్తికి తన ధర్మం మరియు ఇహలోక వ్యవహారాలలో, తన ప్రభువుతో తన సంబంధం, తనతో తన సంబంధం, తన చుట్టూ ఉన్న ప్రజలతో తన సంబంధం మరియు తాను జీవిస్తున్న విశ్వంతో తన సంబంధం కొరకు అవసరమైన ప్రతిదాన్ని కలిగి ఉన్న సమగ్రమైన గ్రంథం.
- సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క సర్వోత్కృష్ట గుణగణాలు మరియు ఆయన పేర్లు, ఆయన కార్యాలు, ఆయన ప్రతిఫలం, ఆయన ధర్మం, ఆయన ఆఙ్ఞలు, ఆదేశాలు మరియు ఆయన విధి నిర్ణయాలను (ఖదర్ మరియు ఖజా) వివరించడం; మరియు సృష్టించడంలో, సార్వభౌమాధికారంలో, ఉపాధి ప్రసాదించడంలో, నిర్వహించడంలో, జీవింపజేయడంలో మరియు మరణింపజేయడంలో ఆయన మాత్రమే ఏకైకుడు అని స్పష్టం చేయడం.
- సృష్టితాలపై మహోన్నతుడైన అల్లాహ్ యొక్క హక్కును వివరించడం, అది ఏమిటంటే, ఆయనను ఏకైక దైవంగా విశ్వసించడం మరియు ఆయన తప్ప మరెవరినీ కాకుండా కేవలం ఆయనను మాత్రమే ఆరాధించడం; మరియు వారు ఆయనను ఆరాధించి, ఆయన ఆదేశాలను పాటించినప్పుడు సృష్టికర్తపై సృష్టితాలకు గల హక్కును వివరించడం. మరియు ఇందులో ఆరాధనలు, నియమాలు మరియు వ్యవహారాల వివరాలు ఉన్నాయి.
- ఇది సృష్టికి జ్ఞానజ్యోతులు, మరియు సరళమైన మార్గం మరియు రుజుమార్గం వైపు మార్గనిర్దేశం చేయడంలో మానవాళికి మార్గదర్శకం, కరుణ, బోధన మరియు సరిపోయేది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
﴾నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరైన (సవ్యమైన) మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు సత్కార్యాలు చేస్తూ ఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫలముందనే శుభవార్తనూ అందజేస్తుంది;﴿
[సూరా అల్ ఇస్రా: 88]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾ఏమీ? వాస్తవానికి మేము నీపై అవతరింప జేసిన ఈ గ్రంథం (ఖుర్ఆన్) వారికి వినిపించబడుతోంది కదా! ఇది వారికి చాలదా? నిశ్చయంగా, ఇందులో విశ్వసించే ప్రజలకు కారుణ్యం మరియు హితబోధలున్నాయి.﴿
[అల్-అన్'కబూత్: 6].
﴾వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు తరఫు నుండి నిదర్శనాలు వచ్చాయి. కావున వాటిని ఎవడు గ్రహిస్తాడో తన మేలుకే గ్రహిస్తాడు! మరియు ఎవడు అంధుడిగా ఉంటాడో అతడే నష్టపోతాడు. మరియు నేను మీ రక్షకుడను కాను.﴿
[అల్ అన్ ఆమ్:103]
﴾ఇను (ఈ ఖుర్ఆన్) లో విశ్వసించేవారి కొరకు, మీ ప్రభువు తరఫు నుండి అనేక బోధనలు, మార్గదర్శకత్వం మరియు కారుణ్యమున్నాయి.﴿
[అల్ ఆరాఫ్: 54]
తాహిర్ బిన్ ఆషూర్ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు:
«మరియు 'బసాఇర్' అనేది 'బసీరహ్' (అంతర్దృష్టి) యొక్క బహువచనం, దీని ద్వారానే సత్యం స్పష్టమవుతుంది... మరియు ఇది ఖుర్ఆన్ యొక్క గొప్పతనాన్ని ప్రస్తావిస్తుంది, మరియు వారు అడిగే నిదర్శనాల కంటే ఇది అత్యంత ఉత్తమమైనది; ఎందుకంటే ఇది తన అద్భుత నిదర్శనం ద్వారా మరియు నిరక్షరాస్యుడైన ప్రవక్త నుండి వెలువడటం ద్వారా ప్రవక్త యొక్క సత్యసంధతను ధృవీకరించడాన్ని, మరియు మార్గదర్శకత్వం, బోధన, సూచనలు మరియు యుగయుగాల వరకు నిలిచి ఉండటాన్ని తనలో కలిపి ఉంచుతుంది. మరియు 'బసాఇర్' అని బహువచనంగా పేర్కొనడానికి కారణం ఏమిటంటే, ఖుర్ఆన్ తాను మార్గదర్శకం చేసే వివిధ కోణాలకు అనుగుణంగా అనేక రకాల మార్గదర్శకాలను కలిగి ఉంటుంది: విశ్వాసాన్ని సంస్కరించడంలో బుద్ధిని ప్రకాశింపజేయడం, ధర్మంలో అవగాహనను సరిదిద్దడం, పరస్పర వ్యవహారాల కోసం నియమాలను ఏర్పరచడం, మానవుల మధ్య సామాజిక సంబంధాలు, ప్రపంచంలో సాఫల్యం మరియు విముక్తి యొక్క మార్గాలను సూచించడం, మరియు నష్టాల అగాధాల నుండి హెచ్చరించడం.»
[అత్ తహ్రీర్ వత్ తన్వీర్ (9/ 238)]
- దైవగ్రంధాలు మరియు వాటిలో ఉన్న మార్గదర్శకత్వం మరియు సూచనలు, హలాల్ మరియు హరామ్, మరియు ధర్మశాసనాల గురించిన ప్రస్తావన. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
﴾మరియు మేము వారి (ఆ ప్రవక్తల) అడుగు జాడలను (ఆసారిహిమ్) అనుసరించేవాడు మరియు తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరచే వాడయిన, మర్యమ్ కుమారుడు ఈసా (ఏసును) పంపాము. మేము అతనికి ఇంజీల్ గ్రంథాన్ని ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి మరియు అది తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం కూడా!﴿
[అల్ మాయిదా : 46]
- పవిత్ర ఖుర్ఆన్లో ప్రస్తావించబడిన అత్యంత గొప్ప విషయాలలో ప్రవక్తలు మరియు దైవిక సందేశాలు, ప్రతి ప్రవక్త తన జాతితో పలికిన మాటలు మరియు దానికి అతని జాతి నాయకులు ఇచ్చిన సమాధానం, అతడిని విశ్వసించిన వారి ప్రతిఫలం మరియు అతడిని విభేదించి అవిధేయత చూపిన వారి శిక్ష, మరియు అల్లాహ్ ప్రతి ప్రవక్తకు మద్దతుగా ఇచ్చిన సూచనల వివరణ ఉన్నాయి. మరియు సృష్టికి దైవప్రవక్తల అవసరం, వారి హెచ్చరికలు మరియు శుభవార్తలు, వారిపై అవతరింపజేయబడిన గ్రంథాల పట్ల విశ్వాసం తప్పనిసరి అయిన విషయాలను వివరించడం, మరియు వాటి నుండి గుణపాఠం మరియు హితబోధ గ్రహించడానికి పూర్వపు జాతుల స్థితిగతులను మరియు వారు తమ ప్రవక్తలతో వ్యవహరించిన తీరును వివరించడం ఉన్నాయి.
- గొప్ప ఖుర్ఆన్ ప్రస్తావించిన అత్యంత గొప్ప అంశాలలో ఒకటి: అంతిమ దినం, ఇది మరణాంతరం లేపబడటం, పునరుత్థానం మరియు ప్రతిఫలం ఇవ్వబడే రోజు, విశ్వాసుల ప్రతిఫలం మరియు వారు స్వర్గంలోకి ప్రవేశించి అందులో శాశ్వతంగా ఉండటం యొక్క వివరణ, మరియు అవిశ్వాసుల ప్రతిఫలం మరియు వారు నరకాగ్నిలోకి ప్రవేశించి అందులో శాశ్వతంగా ఉండటం, మరియు వీటన్నింటి వివరాలు.
- దైవదూతలు, జిన్నులు, షైతానులు వంటి అగోచర లోకాల గురించి చర్చించబడింది. అవి ఎలా సృష్టించబడ్డాయి, వాటి కార్యాలు ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి, తమ ప్రభువుకు దైవదూతల విధేయత, జిన్నులు మరియు షైతానుల అవిధేయత, వాటి ఇతర పరిస్థితులు, అలాగే దైవదూతలు విశ్వాసులకు విధేయ కార్యాలలో సహాయం చేస్తారని, షైతానులు అవిశ్వాసులను పాపాల వైపు బలంగా ప్రేరేపిస్తారని ప్రస్తావించబడింది.
- ధర్మసమ్మతమైన ఆరాధనలను వివరించటం, అనగా: సలాహ్ (నమాజు), జకాత్, ఉపవాసాలు, హజ్, సత్కార్యాలు, ఉపకారం మరియు అల్-వలా వల్-బరా (మైత్రి మరియు విరోధం); లావాదేవీలను అనగా: క్రయవిక్రయాలు, ఋణాలు, వివాహాలు మరియు వారసత్వాలను తెలియజేయటం; ఉత్తమ నైతికతతో ఆత్మను పరిశుద్ధపరచుకోవటం మరియు చెడు ప్రవర్తనల నుండి దానిని శుద్ధి చేయటం; ఇంకా నిషిద్ధ కార్యాలు, అయిష్టకరమైనవి, అనైతికతలు మరియు పాపాలను వివరించటం.
- ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలలో ఉన్న విశ్వపరమైన సూచనలను (చిహ్నాలను) చూడటం మరియు గుణపాఠం పొందటం వైపునకు ఆహ్వానం. అదేవిధంగా దిగంతాలలో మరియు తమ అంతరంగాలలో ఇమిడి ఉన్నవాటిని పరిశీలించటం, మరియు మనిషిని విశ్వాసం, ఇస్లాం, సృష్టికర్తకు విధేయత చూపటం మరియు ఆయన ఆరాధన వైపునకు నడిపించే విధంగా వాటి గురించి ఆలోచించటం; మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలోనూ, రేయింబవళ్ళ మార్పులోనూ, ప్రజలకు ఉపయోగకరమైన వాటిని తీసుకొని, సముద్రంలో పయనించే ఓడలలోనూ మరియు అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి, అందులో వివిధ రకాల జీవరాసులను వర్ధిల్లజేయటంలోనూ; మరియు వాయువులు మరియు మేఘాలు, భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పులలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సంకేతాలున్నాయి.﴿
[అల్ బఖర: 21]
﴾నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలో మరియు రేయింబవళ్ళ అనుక్రమం (ఒకదాని తరువాత ఒకటి రావడం మరియు వాటి హెచ్చుతగ్గుల)లో, బుద్ధిమంతుల కొరకు ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి;﴿
[ఆలె ఇమ్రాన్: 3-4]
- ఈ విశ్వం మరియు మొదటి మానవుని సృష్టి వృత్తాంతం, భూమిపై అతని ప్రాతినిధ్యం, దానిని అభివృద్ధి చేసే బాధ్యతను అతనికి అప్పగించడం, అందులో ప్రాతినిధ్యం వహించడానికి అతనికి సహాయపడే దైవిక ధర్మశాసనాల మరియు విశ్వ నియమాల వివరణ, ఖుర్ఆన్ మార్గదర్శకాల నీడలో మానవుడు నిర్మించవలసిన ఉన్నతమైన నాగరికతను ఏర్పరచడం, మరియు గతించిన జాతులు ఏ విధంగా మార్గభ్రష్టతకు గురై దౌర్జన్యానికి పాల్పడి భూమిలో కల్లోలాన్ని వ్యాపింపజేశాయో అన్న విషయాల వివరణ, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:-
﴾ఏమీ? వీరు భూమిపై ప్రయాణం చేయలేదా? వీరి పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి? వారు, వీరి కంటే ఎక్కువ బలవంతులుగా ఉండేవారు మరియు వారు భూమిని బాగా దున్నేవారు, సేద్యం చేసేవారు మరియు దానిపై, వీరి కట్టడాల కంటే ఎక్కువ కట్టడాలు కట్టారు మరియు వారి వద్దకు వారి సందేశహరులు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.﴿
[అర్రూమ్ : 27]
అల్లాహ్ వాక్కు:
﴾వారికి ఇహలోక జీవితపు బాహ్యరూపం మాత్రమే తెలుసు మరియు వారు పరలోకాన్ని గురించి ఏమరుపాటులో పడి ఉన్నారు.
ఏమీ? వారు తమలో తాము (ఎన్నడూ) ఆలోచించలేదా? ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్య ఉన్నదంతా, అల్లాహ్ సత్యంతో ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడని? అయినా నిశ్చయంగా ప్రజలలో చాలా మంది తమ ప్రభువును దర్శించవలసి వున్న వాస్తవాన్ని తిరస్కరిస్తున్నారు.
చివరకు చెడుకార్యాలు చేసిన వారి ముగింపు చెడుగానే జరిగింది. ఎందుకంటే, వారు అల్లాహ్ సూచనలను అబద్ధాలని నిరాకరించేవారు. వాటిని గురించి ఎగతాళి చేసేవారు.
అల్లాహ్ యే సృష్టి ప్రారంభిస్తాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి (పూర్వ స్థితిలోకి) తెస్తాడు. ఆ తరువాత మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు.﴿
మరియు దైవభీతిపరులకు ఫలితం లభిస్తుందని అల్లాహ్ స్పష్టపరచాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
﴾ఆ పరలోక జీవితపు గృహాన్ని మేము భూమిలో పెద్దరికం చూపగోరని వారి కొరకు మరియు కల్లోలం రేకెత్తించని వారి కొరకు ప్రత్యేకిస్తాము. మరియు దైవభీతి గలవారికే (మేలైన) పర్యవసానం ఉంటుంది.﴿
[అల్ ఖిసస్: 83]
- ఖుర్ఆన్లో ఉన్న బుద్ధిపరమైన ఆధారాలు, తార్కిక ఉపమానాలు, ఉదాహరణలు మరియు ప్రత్యర్థులను నిశ్శబ్దులను చేసే ప్రశ్నలు ఎంతో విస్తారంగా ఉన్నాయి; వాటిని పూర్తిగా ఆవరించడం చాలా కష్టసాధ్యం. ఇవన్నీ ఖుర్ఆన్ ప్రస్తావించిన విషయాలపై స్పష్టమైన సాక్ష్యాలు మరియు ఖచ్చితమైన ప్రమాణాలు. నిష్పక్షపాతంగా వీటిని పరిశీలించే వ్యక్తి, అవి సూచించిన సత్యాన్ని అంగీకరించి లొంగిపోవడం తప్ప మరేమీ చేయలేడు. అంతేకాక, నిజాయితీతో సత్యాన్వేషణ చేసే నాస్తికుడు కూడా వీటిని పరిశీలిస్తే తన నాస్తికత్వాన్ని విడిచిపెట్టి, ఈ మహత్తర ఖుర్ఆన్ తీసుకువచ్చిన సత్యాన్ని విశ్వసిస్తాడు.
- అత్యున్నతమైన మహోన్నత విలువలు : ఇవి అందుబాటులో ఉండి, వాటిని సాధించడానికి కృషి చేస్తే తప్ప ఒక మార్గదర్శక నాగరికత లేదా సమగ్ర పౌర సమాజం ఏర్పడజాలదు. కాబట్టి పవిత్ర ఖురాన్లో మీరు విశ్వాస, న్యాయ, ఆరోగ్య, భద్రతా, సామాజిక, ప్రవర్తనా మరియు ఆర్థిక విలువలతో పాటు భూమిపై మానవ మనుగడకు అవసరమైన ఇతర విలువలు మొదలైన వాటిని కనుగొంటారు.
మరియు పవిత్ర ఖుర్ఆన్ ను పఠించేవారు గమనించవలసిన విషయం ఏమిటంటే, మిగతా మానవ గ్రంథాల వలె ఖుర్ఆన్ విషయానుసారంగా వర్గీకరించబడి ఉండటాన్ని వారు పొందలేరు; బదులుగా ఇదొక దైవ గ్రంథం, ఇందులో విశ్వాస సంబంధిత అంశం, దాని ఆధారం మరియు దాని ప్రతిఫలం అనేవి భూమిని అభివృద్ధి పరుచుటకు గల ప్రాపంచిక నియమంతో అనుసంధానించబడి వస్తాయి. దానిని అనుసరించి, ఈ విషయంలో అవిధేయత చూపిన పూర్వపు జాతులలోని ఒక జాతి పరిస్థితి యొక్క వివరణ వస్తుంది. కాబట్టి, దివ్యఖుర్ఆన్ వివరించిన విషయాలను తెలుసుకోవాలని కోరుకునే వారు, అందులోని అంశాలను గ్రహించడానికి ఖుర్ఆన్ ను పూర్తిగా పఠించాలి.
కావున, తన మానవత్వాన్ని గౌరవించే మరియు తన బుద్ధిని సన్మానించే ప్రతి ఒక్కరూ, మానవాళికి లభించిన గ్రంథాలలో దీనికంటే ఉత్తమమైన గ్రంథం మరొకటి లేని ఈ మహా దివ్యగ్రంథాన్ని చదవడానికి గట్టిగా కృషి చేయాలి, లేదా ఒకవేళ అతనికి అరబీ భాష తెలియకపోతే దాని భావార్థం యొక్క అనువాదాన్ని చదవాలి. ఒక బుద్ధిమంతుడికి, అత్యంత వివేకవంతుడైన ఒక జ్ఞాని ఒక పుస్తకాన్ని రచించాడని మరియు అందులో తన జ్ఞానాన్నంతటినీ నిక్షిప్తం చేశాడని చెప్పబడితే, మనిషి దానిని అధ్యయనం చేసేందుకు కృషి చేయడం ఎంతో సమంజసం. అలాంటప్పుడు, ఓ మనిషీ! సాక్షాత్తూ ఒక దైవగ్రంథమే నీ ముందు ఉండి, అది ఏ భాషలో అవతరించిందో ఈ రోజు వరకు అదే భాషలో ఉండి, అందులో ఏ అక్షరమైన తగ్గడం గానీ, పెరగడం గానీ జరగకుండా రక్షించబడి, ఎలాంటి మార్పులు చేర్పులకు గురికాకుండా సురక్షితంగా భద్రంగా ఉన్నప్పుడు, మరియు అందులో గతించిన వారి వృత్తాంతాలు, గడిచిన మరియు మిగిలి ఉన్నవారి కోసం ధర్మశాస్త్రం, మరియు ప్రతి ప్రాణి యొక్క అంతిమ గమ్యం గురించి స్పష్టమైన వివరణ ఉండి కూడా, ఆ తర్వాత నీవు దానిని చదవకపోవడం ఎలా సమంజసం? నిశ్చయంగా మనిషి ఖుర్ఆన్ను విస్మరించడం మరియు దాని పట్ల శ్రద్ధ వహించకపోవడం వలన ఖుర్ఆను కరీంకు ఎటువంటి నష్టం వాటిల్లదు, బదులుగా ముఖం తిప్పుకున్న ఆ వ్యక్తికే నష్టం వాటిల్లుతుంది; ఎందుకంటే అల్లాహ్ తన సృష్టి పట్ల ఎలాంటి అవసరం లేనివాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴾మరియు ఈ ఖుర్ఆన్ ను చదివి వినిపించాలని కూడా (ఆజ్ఞ ఇవ్వబడింది). కావున మార్గదర్శకత్వం పొందినవాడు తన మేలుకే, మార్గదర్శకత్వం పొందుతాడు. మరియు మార్గభ్రష్టుడైన వాడితో అను: "నిశ్చయంగా, నేను హెచ్చరిక చేసేవాడను మాత్రమే!﴿
[అన్-నమ్ల్ : 88]
﴾కావున (అల్లాహ్ మార్గంలో) పాటుపడే వాడు నిశ్చయంగా, తన (మేలు) కొరకే పాటు పడుతున్నాడని (తెలుసుకోవాలి). నిశ్చయంగా, అల్లాహ్ సర్వలోకాల వారి అక్కర ఏ మాత్రం లేనివాడు.﴿
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
المصدر
ملاحظات
--