Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 72 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ కూర్చున్నాము — మాతో అబూ బకర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కూడా ఉన్నారు — అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం లేచి నిలబడి నడిచిపోతూ మా మధ్య నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎంతసేపైనా ఆయన తిరిగి రాకపోవడంతో మేము ఆందోళనకు లోనయ్యాము. ఆయనకు ఏదైనా జరిగిందేమో అని భయపడ్డాము. మేము భయపడుతూ లేచి నిలిచాము. నేనే మొదట భయంతో స్పందించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం‌ను వెతుకుతూ బయలుదేరాను. దారిలో బనూ నజ్జార్ తెగకు చెందిన ఒక అన్సారీ సాహాబీ తోట వద్దకు చేరుకున్నాను. ఆ తోట చుట్టూ తిరిగి, లోనికి ప్రవేశించడానికి ఏదైనా ద్వారం ఉందేమో అని చూశాను — కానీ ఏమి కనిపించలేదు. తోటకు బయట ఉన్న ఒక బావి నుండి తోట లోనికి నీళ్ళు ప్రవేశిస్తూ ఉన్న ఒక ప్రదేశం కనిపించింది. నేను బాగా క్రిందకు ఒదిగిపోయి ఆ ప్రదేశం గుండా లోనికి ప్రవేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం‌ వారి వద్దకు చేరుకున్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం‌ “అబూ హురైరహ్” అన్నారు; దానికి నేను “అవును ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం‌” అని జవాబు పలికాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం‌ “ఏమైంది?” అని ప్రశ్నించారు. నేను “మీరు మాతో ఉన్నారు, ఆ తరువాత లేచి వెళ్లిపోయారు, ఎంత సేపైనా తిరిగి రాకపోయేసరికి మేము భయపడిపోయాం, మీకు ఏదైనా జరిగిందేమో అని. భయంతో అందరికంటే ముందు నేను మిమ్మల్ని వెదుకుతూ ఈ తోటకు వచ్చాను. అటు ప్రక్కనుంచి నక్క ప్రవేశించినట్లు నేను తోటలోనికి ప్రవేశించినాను. మిగతా వాళ్ళు నా వెనుక వస్తున్నారు” అన్నాను. ఆయన ﷺ, “ఓ అబూ హురైరా”, అని అన్నారు మరియు తన రెండు పాదరక్షలను నాకు అందజేసి, “ఈ రెండు పాదరక్షలతో వెళ్ళు. ఈ తోట చుట్టూ ఉన్న గోడ వెనుక నీవు ఎవరిని కలిసినా, అతడు “అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని తన హృదయంలో పూర్తి నిశ్చయతతో సాక్ష్యమిచ్చి నట్లైతే, అతనికి స్వర్గ ప్రవేశాన్ని గురించిన శుభవార్తనివ్వు” అన్నారు. నేను మొదటగా కలిసిన వ్యక్తి ఉమర్ (రదియల్లాహు అన్హు). ఆయన అడిగారు “నీ చేతిలో ఆ రెండు పాదరక్షలు ఏమిటి ఓ అబూ హురైరహ్?” నేను సమాధానమిచ్చాను: “ఇవి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహివ సల్లం గారి పాదరక్షలు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం‌నన్ను వీటితో పంపారు. నేను కలిసిన ఎవరికైనా, అతడు “అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వముతో సాక్ష్యము ఇచ్చినట్లైతే, అతనికి స్వర్గప్రవేశము యొక్క శుభవార్త వినిపించమని” అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) నా ఛాతీపై బలంగా మోదినారు. నేను వెల్లకిలా పడిపోయాను. ఆయన “వెనుకకు తిరిగి వెళ్ళు, ఓ అబూ హురైరహ్” అన్నారు. అప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకు తిరిగివచ్చాను. నేను ఆగకుండా ఏడుస్తూనే ఉన్నాను. నా వెనుకనే ఉమర్ (రదియల్లాహు అన్హు) వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అడిగారు: “అబూ హురైరా! నీకు ఏమైంది?” “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం‌కు చెప్పాను: “నేను ఉమర్ (రదియల్లాహు అన్హు)ను కలిశాను. మీరు నాకు అప్పగించిన సందేశాన్ని ఆయనకు చెప్పాను. ఆయన నా ఛాతీపై బలంగా కొట్టారు, నేలపై పడిపోయాను. ఆయన: “ఓ అబూ హురైరహ్, తిరిగి వెళ్ళు” అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం ప్రశ్నించారు: “ఓ ఉమర్, నీవు ఇలా ఎందుకు చేశావు?” ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా సమాధానమిచ్చారు: “ఓ రసూలుల్లాహ్! (సల్లల్లాహు అలైహి వ సల్లం) నా తండ్రి మరియు తల్లి మీ కొరకు త్యాగం (ఖుర్బాన్) చేయబడుదురు గాక. మీరు నిజంగా అబూ హురైరాని మీ పాదరక్షలతో పంపినారా? ఎవరు కలిసినా, అతడు “అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని హృదయపూర్వకంగా, పూర్తి నిశ్చితత్వముతో సాక్ష్యము ఇచ్చినట్లైతే, అతనికి స్వర్గప్రవేశము యొక్క శుభవార్త వినిపించమని” చెప్పినారా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం‌ “అవును” అన్నారు. అపుడు ఉమర్ రజియల్లాహు అన్హు “అలా చేయవద్దు, (మంచి పనులు చేయడం వదిలివేసి) ప్రజలు ఆ ఒక్క వాక్యం పైనే భారం వేసి ఉండిపోతారేమోనని నాకు భయంగా ఉన్నది. వారిని మంచి పనులు చేయడం కొనసాగించనివ్వండి” అన్నారు. దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం‌ “అలాగే కానివ్వండి” అన్నారు.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్, నేను మిమ్మల్ని తప్ప మరింకెవరినీ ప్రశ్నించ వలసిన అవసరం లేని విధంగా – నాకు ఇస్లాం ను గురించి బోధించండి.” దానికి ఆయన ఇలా అన్నారు: “నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని (మనస్పూర్తిగా) పలుకు; మరియు దానిపై స్థిరంగా ఉండు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు:
మహోన్నతుడూ, సర్వ శక్తిమంతుడు అయిన అల్లాహ్ నుండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పంపబడిన దాని నుండి వారు ఇలా ఉల్లేఖించినారు: “నిశ్చయంగా అల్లాహ్ మంచి పనులను గురించి, మరియు చెడు పనులను గురించి నమోదు చేసినాడు. తరువాత దానిని గురించి ఇలా విశదీకరించినాడు – ఎవరైతే ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకుంటాడో, మరి ఏదైనా కారణం వలన దానిని చేయలేక పోతాడో, అల్లాహ్ తన వద్ద, అతడి కొరకు ఆ మంచి పని సంపూర్ణంగా చేసినట్టు వ్రాస్తాడు మరియు ఎవరైతే మంచి పని చేయాలని నిర్ణయించుకుని, ఆ పనిని చేస్తాడో, అల్లాహ్ తనవద్ద అతడి కొరకు పది నుండి మొదలుకుని ఏడు వందల రెట్లు ఎక్కువగా మంచి పనులు చేసినట్లు, ఇంకా దానికంటే కూడా ఎక్కువగా చేసినట్లు వ్రాస్తాడు. మరియు ఎవరైతే ఏదైనా చెడు పని చేయాలని సంకల్పించు కుంటాడో మరియు దానిని చేయకుండా ఉండి పోతాడో, అల్లాహ్ తన వద్ద అతడి కొరకు ఒక మంచి పని సంపూర్ణంగా చేసినట్టు వ్రాస్తాడు. మరియు ఎవరైతే చెడు పని చేయాలని సంకల్పించుకుని ఆ పని చేస్తాడో, అల్లాహ్ తనవద్ద అతడి కొరకు ఒక చెడు పని చేసినట్లుగా వ్రాస్తాడు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
తాను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ప్రయాణాలలో ఒక ప్రయాణం లో ఆయన వెంట ఉన్నారు. అపుడు వారి వెంట ఉన్న జనులు తమ తమ విశ్రాంతి స్థలాలలో, గుడారాలలో ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందేశహరుణ్ణి వారి వద్దకు “ఒంటెల మెడలలో వేలాడదీసిన ఎటువంటి దారాన్ని గానీ, ఎటువంటి పట్టాను గానీ లేక ఎటువంటి గొలుసును గానీ త్రెంచి వేయకుండా వదలకండి” అనే ఆదేశముతో పంపినారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“కొంతమంది ‘సబ్’యీ’ లు (యుద్ధములో బందీలుగా పట్టుబడ్డ స్త్రీలు మరియు పిల్లలు – వీరు “సబ్’యీ” అనబడతారు. మగ యుద్ధ ఖైదీలను సాధారణంగా ‘అసీర్’ أَسِير అంటారు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ప్రవేశపెట్టబడినారు. వారిలో ఒక స్త్రీ ఒక శిశువుకు తన రొమ్మును పితుకుతూ పాలు త్రాపిస్తూ కనిపించింది. బందీలలో ఏ శిశువు కనిపించినా ఆమె అదే విధంగా ఆ శిశువును తీసుకుని, తన చాతీని నొక్కిపట్టి, తన రొమ్మును పితుకుతూ ఆ శిశువుకు పాలు త్రాపిస్తున్నది. అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు: “ఈ స్త్రీ తన బిడ్డను అగ్నిలో పడవేస్తుందని మీరు అనుకుంటున్నారా?” దానికి మేము: “లేదు, ఆమె తన శిశువును అగ్నిలో విసిరివేయకుండా నిరోధించగలిగితే, ఆమె (నిశ్చయంగా) విసిరివేయదు” అన్నాము. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: “నిశ్చయంగా అల్లాహ్ తన దాసులపట్ల, ఈ స్త్రీ తన బిడ్డ పట్ల ఉన్నదానికంటే ఎక్కువ దయ మరియు కరుణ గలవాడు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, “అల్లాహ్ ప్రకటన: “ఓ నా దాసులారా! నేను ‘జుల్మ్’ను (దౌర్జన్యం, హింస, పీడన, అన్యాయము మొ.) నాపై నేను నిషేధించుకున్నాను మరియు ‘జుల్మ్’ను మీ మధ్యన కూడా నిషేధించాను. కనుక మీరు ఒకరిపైనొకరు ‘జుల్మ్’నకు పాల్బడకండి, ఓ నా దాసులారా! ఎవరికైతే నేను మార్గదర్శకత్వం చేసినానో, వారు తప్ప మిగిలిన వారందరూ మార్గభ్రష్ఠులైన వారే. కనుక నా నుంచి మార్గదర్శకత్వం కోరుకొండి, నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను. ఓ నా దాసులారా! ఎవరికైతే నేను తినిపించినానో, వారు తప్ప మిగిలిన వారందరూ ఆకలితో అలమటించే వారే. కనుక నా నుండి పోషణ కోరుకొండి, నేను మీకు పోషణనిస్తాను. ఓ నా దాసులారా! ఎవరికైతే నేను వస్త్రాలను తొడిగించానో, వారు తప్ప మిగిలిన వారందరూ వివస్త్రులే, కనుక నా నుండి వస్త్రాలను కోరండి, నేను మీకు వస్త్రాలనిస్తాను. ఓ నా దాసులారా! నిశ్చయంగా మీరు రాత్రుల యందు, పగటియందు పాపకార్యాలకు పాల్బడతారు మరియు నేను మీ పాపాలనన్నింటినీ క్షమిస్తాను. కనుక పాపక్షమాపణ కొరకు నన్ను అర్థించండి, నేను మీ పాపాలను క్షమిస్తాను. ఓ నా దాసులారా! ఒకవేళ మీరు నాకు ఏదైనా హాని కలిగించ దలుచుకుంటే, మీరు నాకు ఏమీ హాని కలిగించలేరు. అలాగే ఒకవేళ మీరు నాకు ఏదైనా మంచిని కలుగజేయ దలుచుకుంటే, మీరు నాకు ఏమీ మంచిని కలుగజేయలేరు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులందరూ - మీలో ఎవరిలోనైనా ఉన్న అత్యంత దైవభీతి గల హృదయం మాదిరి – అత్యంత దైవ భీతి గలవారిగా, అత్యంత పవిత్రులుగా మారిపోయినా, అది నా ఘనతకు, నా ప్రభుతకు ఏమీ జోడించదు, ఏమీ ఉన్నతం చేయదు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులందరూ - మీలో ఎవరిలోనైనా ఉన్న అత్యంత హీనమైన, నీచమైన, పాపిష్ఠి హృదయం మాదిరి – అత్యంత పాపిష్ఠులుగా, నీచులుగా, మారిపోయినా, అది నా ఘనతకు, నా ప్రభుతకు ఏమీ నష్టము, హాని కలిగించదు, ఏమీ తక్కువ చేయదు. ఓ నా దాసులారా! మీలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరి వాని వరకు, మొత్తం మానవులు, జిన్నులు – ఒకవేళ అందరూ కలిసి ఒక మైదానంలో నిలబడి, నన్ను అర్థిస్తే, నేను అందరికీ వారు కోరుకున్నదంతా ప్రసాదించినా, అది నా ఖజానా నుంచి, సముద్రంలో ముంచిన సూది మొన సముద్రం నుండి ఎంత నీటిని తగ్గిస్తుందో, అంత కూడా తగ్గించదు. ఓ నా దాసులారా! నిశ్చయంగా, అవి మీ కర్మలు మాత్రమే, వాటి కొరకు మీరు జవాబుదారులుగా నిలబెట్ట బడతారు. అపుడు నేను మీకు దాని పూర్తి ప్రతిఫలం ప్రసాదిస్తాను. కనుక ఎవరైనా మంచిని, శుభాన్ని సాధించినట్లయితే అందుకు అల్లాహ్ ను ప్రస్తుతించాలి మరియు ఎవరైనా చెడుకు పాల్బడితే అందుకు మరెవ్వరినో కాకుండా తనను తాను నిందించుకోవాలి.
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా తాను హబషహ్(అబిసీనియా) లో మారియా అని పిలువబడే ఒక చర్చీను చూసిన విషయాన్ని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించినారు. అందులో తాను చూసిన ప్రతిమలను (విగ్రహాలను) గురించి ప్రస్తావించినారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అది ఎటువంటి జాతి అంటే – తమలో ధర్మపరాయణుడైన ఒక దాసుడు చనిపోయినా, లేక ఒక ధర్మపరాయణుడైన వ్యక్తి చనిపోయినా వారు అతని సమాధిపై ఒక ఆరాధనా గృహాన్ని (దేవాలయాన్ని) నిర్మించి అందులో వారి విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం మొదలుపెడతారు. అల్లాహ్ వద్ద వారు సృష్టి మొత్తములో అత్యంత నీచులు, దుష్టులు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు