Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 72 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“ఒక మంచి పనికి (సత్కార్యమునకు) సంబంధించి విశ్వాసికి అల్లాహ్ ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ మంచి పని కొరకు ఆయన అతడికి (విశ్వాసికి) ఈ ప్రపంచములో ప్రసాదిస్తాడు, మరియు పరలోకములోనూ దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మరియు అవిశ్వాసి విషయంలో, అతడు అల్లాహ్ కొరకు మాత్రమే చేసిన మంచి పనులకు, అల్లాహ్ అతనికి ఈ ప్రాపంచిక జీవితములోనే ప్రసాదిస్తాడు. అతడు పరలోకము చేరుకున్నపుడు అతనికి ప్రతిఫలం ప్రసాదించడానికి ఒక్క సత్కార్యమూ ఉండదు".
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
ఒకసారి మేము మొత్తం తొమ్మిది మంది లేక ఎనిమిది లేక ఏడుగురము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఉన్నాము. అపుడు ఆయన “అల్లాహ్ యొక్క సందేశహరుని చేతిపై మీరు విధేయతా ప్రమాణం చేయరా?” అన్నారు. నిజానికి మేము ఇటీవలనే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ప్రమాణము చేసి ఉన్నాను. కనుక మేము - “ముందుగానే మీ చేతిపై ప్రమాణము చేసినాము కదా ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం !” అన్నాము. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమీ, అల్లాహ్ యొక్క సందేశహరుని చేతిపై మీరు విధేయతా ప్రమాణం చేయరా?” అన్నారు. మేము మరలా - “మేము ముందుగానే మీ చేతిపై ప్రమాణము చేసినాము కదా ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం !” అన్నాము. దానికి ఆయన మళ్ళీ “ఏమీ, అల్లాహ్ యొక్క సందేశహరుని చేతిపై మీరు విధేయతా ప్రమాణం చేయరా?” అన్నారు. అపుడు ఔఫ్ ఇబ్న్ మాలిక్ ఇలా అన్నారు: “మేము మా చేతులను ముందుకు చాచి, ఇలా అన్నాము “మేము ముందుగానే మీ చేతిపై ప్రమాణము చేసినాము ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ; మరి ఇపుడు ఏ విషయమై ప్రమాణం చేయాలి?” దానికి ఆయన “కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తామని, ఆయనకు ఎవరినీ సాటి కల్పించమని; ఐదు (ఫర్జ్) నమాజులను విధిగా ఆచరిస్తామని; (పాలకునికి) విధేయులుగా ఉంటామని;” తరువాత లోగొంతుతో “దేని కొరకూ ప్రజలను అర్థించము అని” అన్నారు. వాస్తవములో నేను ఇది చూసాను - (సహాబాలలో) కొంతమంది తమ చేతి నుండి కొరడా (కమ్చీ) నేలపై జారిపడినా దానిని ఎత్తి ఇవ్వమని కూడా ఎవరినీ అర్థించే వారు కాదు.”
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
“మస్జిదులోనికి ప్రవేశించునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “అఊదుబిల్లాహిల్ అజీం, వబి వజ్’హి హిల్ కరీం; వ సుల్తానిల్ ఖదీమ్; మినష్’షైతానిర్రజీమ్” (నేను అల్లాహ్ యొక్క కరుణాపూరితమైన వర్చస్సు ద్వారా; (సర్వసృష్టిపై) ఆయన శాశ్వతమైన ఆధిపత్యము ద్వారా; శపించబడిన షైతాను బారి నుండి మహిమాన్వితుడైన అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను)”. అది విని అక్కడ ఉన్న అతను “అంతేనా?” అన్నాడు. దానికి నేను “అవును” అన్నాను. అపుడు అతడు ఇలా అన్నాడు “ఆ పదాలు పలికినపుడు షైతాను ఇలా అంటాడు “ఇతడు రోజంతా నా నుండి రక్షించబడినాడు.”
హసన్ హదీథు. అబూదావూద్ నమోదు చేసినారు:
“ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ ఇలా పలికినాడు: ‘ఎవరైతే నా వలీ పట్ల (వలీ – ధర్మనిష్టాపరుడైన అల్లాహ్ యొక్క దాసుడు) శతృత్వం వహిస్తాడో నేను అతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. నేను ఏదైతే అతనిపై ‘ఫర్జ్’ చేసినానో అది నాకు అత్యంత ఇష్టమైనది; నా దాసుడు దాని ద్వారా తప్ప నాకు చేరువ కాలేడు. ఇంకా అతడు ‘నఫీల్’ ఆచరణలు ఆచరిస్తూ నాకు ఇంకా చేరువ అవుతూనే ఉంటాడు, ఎంతగా అంటే, నేను అతడిని ప్రేమించేంత వరకు. నేను అతడిని ప్రేమించినట్లయితే నేను అతడి వినికిడి శక్తినవుతాను, దేని ద్వారానైతే అతడు వింటాడో, నేను అతడి దృష్టినవుతాను, దేనిద్వారానైతే అతడు చూడగలుగుతాడో, నేను అతడి చేతినవుతాను, దేని ద్వారానైతే అతడు (శత్రువులను) ప్రతాడించుతాడో, నేను అతడి కాలునవుతాను, దేని ద్వారానైతే అతడు నడుస్తాడో. అతడు దేని కొరకైనా అర్థించినట్లయితే, నేను అతనికి తప్పనిసరిగా ప్రసాదిస్తాను; అతడు నా నుండి రక్షణ కోరితే, నేను అతనికి రక్షణ ప్రసాదిస్తాను. ఒక విశ్వాసి ప్రాణాలను తీసే విషయంలో సంకోచించినంతగా, నేను ఏ విషయములోనూ సంకోచించను. ఎందుకంటే అతడు మృత్యువును ఇష్టపడడు, మరియు అతనికి కష్టం కలిగించడాన్ని నేను ఇష్టపడను.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
“ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాలో ఒక్కొక్కసారి ఎటువంటి ఘోరమైన ఆలోచనలు వస్తాయంటే – అని అతడు వాటి గురించి అన్యోపదేశంగా చెబుతూ – వాటిని నోటితో పలకడం కన్నా తాను బొగ్గుగా మారడాన్ని ఇష్టపడతాను” అన్నాడు. దానికి ఆయన “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, (అల్లాహ్ అందరికన్నా పెద్దవాడు, అల్లాహ్ అందరికన్నా పెద్దవాడు), అల్’హందులిల్లాహ్ (స్తోత్రములన్నీ అల్లాహ్ కొరకే) ఆయన, వాడి (షైతాను యొక్క) కుతంత్రాన్ని (మనిషిలో) ఆలోచనలు రేకెత్తించడంగా (మాత్రమే) మార్చివేసాడు (పరిమితం చేసాడు)” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అబూదావూద్ మరియు అన్నసాయీ కుబరాలో నమోదు చేసినారు:
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఘోరమైన పాపము ఏది?”; దానికి ఆయన “అల్లాహ్’యే నిన్ను సృష్టించినప్పటికీ (నీ సృష్టికర్త అయినప్పటికీ), అల్లాహ్ కు సాటిగా నీవు మరొకరిని తీసుకు రావడం, ” అన్నారు. దానిని నేను “నిశ్చయంగా అది ఘోరమైనదే” అన్నాను. తరువాత అడిగాను “(దాని) తరువాత ఏది?”; దానికి ఆయన “(నీవు తినే దానిలో) నీతో పాటు తింటాడు అనే భయంతో నీ బిడ్డను నీవు చంపడం” అన్నారు; నేను మళ్ళి అడిగాను: “దాని తరువాత ఏది?” అని. దానికి ఆయన “నీ పొరుగు వాని భార్యతో నీవు వ్యభిచరించడం” అన్నారు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“కుక్క మరియు చిత్రపటం ఉన్న ఇంటిలోనికి దైవదూతలు ప్రవేశించరు.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు